Komatireddy Rajagopal Reddy : వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తానే పదేళ్లపాటు ఉంటానని వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రికి కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు.
బుధవారం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన కామెంట్లు చేశారు.. తాము రాజశేఖర్ రెడ్డి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చామని.. తమ ఒంట్లో ప్రవహించేది కాంగ్రెస్ రక్తమని.. తనను కూడా చాలామంది ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారని.. ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాంబు పేల్చారు.
రాజగోపాల్ రెడ్డి 2023 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. గతంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసి బిజెపిలోకి వెళ్లారు. ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం పాటు బీజేపీ లోనే ఆయన కొనసాగారు. ఆ తర్వాత 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మునుగోడు స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి కి మంత్రి పదవి దక్కింది. రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి మీద చాలావరకు ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు అధిష్టానం కూడా మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. 2023లో ఏర్పాటు చేసిన మంత్రివర్గం తర్వాత ఒకసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణ చేసింది. అందులో రకరకాల సమీకరణాలు చేసింది. అప్పట్లో రేవంత్ రెడ్డి సిఫారసు చేసిన వ్యక్తులకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవులు ఇవ్వకపోవడం విశేషం. మంత్రి పదవి రాకపోవడంతో రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానం మీద కాకుండా.. ముఖ్యమంత్రి మీద అలక బూనారు. ముఖ్యమంత్రి మీద పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా కూడా ఆయన అదే స్థాయిలో మాట్లాడారు. ఈసారి వైయస్ వర్ధంతి సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. మరి దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన మాటలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోయాయి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ కలహాలకు ఆజ్యం పోసే విధంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.