Kavitha Tears : మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితిలో ఉన్న కీలక నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకుంది తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత. కానీ తొలిసారిగా ఆమె కన్నీరు పెట్టుకుంది. అది కూడా అత్తగారింట్లో..
కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సోమవారం తన అత్తగారిల్లు నిజామాబాదులో ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ఈసారి తన మాటల్లో అత్యంత పదును చూపించారు. నేరుగా ప్రశ్నలను తన తండ్రి కెసిఆర్ కే వేశారు. నేను ఏం తప్పు చేశాను.. నన్ను పార్టీ కోసం తీహార్ జైలుకు ఎందుకు పంపించారు.. నన్ను దాదాపు అన్ని రోజులపాటు జైల్లో ఉంచారు. నా భర్తకు .. నా పిల్లలకు దూరం చేశారు. చివరికి అంత కష్టపడి వస్తే పార్టీ నుంచి బయటికి గెంటేశారు. మన ఇంట్లో ఆడబిడ్డకు కష్టం వస్తే ఇలానే ఉంటామా.. ఇంట్లో నుంచి బయటికి గెంటి వేస్తామా.. నేను భారత రాష్ట్ర సమితి నాయకులను ఒకటే అడగదలచుకున్న.. నన్ను ఎందుకు పంపించారు.. ఎవరి ప్రయోజనాల కోసం పంపించారు.. నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టారు” అంటూ కవిత ప్రశ్నించింది. అక్కడితోనే ఆగిపోలేదు.. ప్రతి మాటలోనూ కన్నీరు పెట్టుకుంది. ఆడపిల్లనైన నన్ను ఇబ్బంది పెట్టారని భావోద్వేగానికి గురైంది.
కవిత జైలుకు వెళ్ళినప్పుడు.. ఈడి అధికారులు సోదాలు చేసినప్పుడు.. జైలు నుంచి తిరిగి వచ్చినప్పుడు.. ఆమధ్య తన కొడుకు కోసం అమెరికా వెళ్లి శంషాబాద్ విమానాశ్రయంలో మాట్లాడినప్పుడు.. తన తండ్రికి తాను రాసిన లేఖలను మీడియాకు విడుదల చేసినప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలోనూ కవిత ఏనాడు కూడా కన్నీరు పెట్టలేదు. పైగా ధైర్యంగా మాట్లాడింది. కానీ తొలిసారి అత్తగారింటికి వెళ్లిన తర్వాత కన్నీరు పెట్టుకుంది.. బాధపడింది. భావోద్వేగానికి గురైంది.
ఇటీవల కాలంలో కేటీఆర్ మీద.. హరీష్ రావు మీద.. సంతోష్ రావు మీద విమర్శలు చేసిన కల్వకుంట్ల కవిత తొలిసారిగా తన తండ్రిని నేరుగా ప్రశ్నించింది. అంతేకాదు తన తండ్రి గొప్పగా చెప్పుకునే కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి చుక్కనీరు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రాలేదని.. అలాంటప్పుడు ఆ ఎత్తిపోతల పథకం వల్ల ఉపయోగం ఏంటని కవిత ప్రశ్నించింది. అక్కడితోనే ఆగలేదు.. తాను భారత రాష్ట్ర సమితి కోసం ఎంతగానో కష్టపడి పని చేశానని.. చివరికి అత్యంత అవమానకరంగా బయటికి గెంటివేషారని తన ఆవేదన చెప్పుకుంది. ఈ స్థాయిలో తనను ఇబ్బంది పెడితే ఆ పార్టీకి మంచి జరుగుతుందని ఆమె ప్రశ్నించింది.
కవిత కన్నీరు పెట్టుకోవడం.. ఉద్యమ కాలంలో మాట్లాడినట్టు ప్రసంగించడంతో జనాలు ఆమెకు కనెక్ట్ అయ్యారు. నిజంగానే ఆమెకు పార్టీలో అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను తెలంగాణ రక్షణ సేన నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. అయితే ఇన్నాళ్ల వరకు కవిత మాట్లాడిన మాటలకు గులాబీ పార్టీ నాయకులు ఏదో ఒక రూపంలో కౌంటర్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కవిత కన్నీరు పెట్టింది. ఆ కన్నీరుకు ఒక అర్థం ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది గులాబీ పార్టీ మైంటైన్ చేసే సోషల్ మీడియా వర్కర్లు కాదు.. కెసిఆరే. ఆల్రెడీ హరీష్ రావును ఆమె గుంటనక్క అంటున్నది. సంతోష్ రావును మరో మాట అంటున్నది. హరీష్ రావు ఆమెకు బదులు చెప్పే స్థాయిలో లేడు. సంతోష్ రావు విలేకర్ల ముందుకు రాడు. కేటీఆర్ తెలంగాణలోనే లేడు. మరి కెసిఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తారా.. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్తారా.. తెలంగాణ సమాజం ఈగర్లి వెయిటింగ్..