Megha Krishna Reddy : రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. యావత్ దేశంలోనూ పెద్దపెద్ద ప్రాజెక్టులు కడుతున్నాడు మేఘా కృష్ణారెడ్డి. రాజకీయ పార్టీలకు విరాళాలు కూడా ఇస్తున్నాడు. కెసిఆర్ అంత గొప్పగా చెప్పుకున్న కాలేశ్వరం కట్టింది ఇతడే. ఇప్పుడు పోలవరం కడుతున్నది కూడా ఇతడే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు కట్టింది కూడా ఇతడే. అంతేనా హిమాలయాలలో సొరంగాలు తవ్వుతున్నది.. కూడా ఇతని కంపెనీ నే.
ఒక ముక్కలో చెప్పాలంటే బీహార్ నుంచి జమ్ము కాశ్మీర్ వరకు.. ఏపీ నుంచి తెలంగాణ వరకు కృష్ణారెడ్డి కంపెనీనే పనులు చేస్తున్నది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే.. ముఖ్యమంత్రిగా ఎవరు సీట్లో కూర్చున్నా సరే కృష్ణారెడ్డి కంపెనీ కి పనులు దక్కుతాయి. ఆ కంపెనీ దర్జాగా పనులు చేస్తూనే ఉంటుంది. ఇందులో మతల బు ఏంటో అందరికీ తెలుసు. పైగా టీవీ9.. టెన్ టీవీ లాంటి చానల్స్ కృష్ణారెడ్డి చేతిలో ఉన్నాయి. ఆ మధ్య కృష్ణారెడ్డి.. రవి ప్రకాష్ కలిసి ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టాలని అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు.
రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశంలో ఉన్న ప్రధాన రాష్ట్రాలలో అటు ప్రతిపక్షానికి .. ఇటు అధికార పక్షానికి కృష్ణారెడ్డి అత్యంత కావలసిన వ్యక్తి. ఆమధ్య కృష్ణారెడ్డి అమ్మగారు చనిపోతే.. దశదినకర్మకు అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. దీనిని బట్టి కృష్ణారెడ్డి కొనసాగించే లౌక్యం ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కృష్ణా రెడ్డికి సంబంధించి ఒక వార్త మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.
కృష్ణారెడ్డి కంపెనీ లో ఆయన మామ పిచ్చిరెడ్డి సంబంధించిన ఆస్తులను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. దీనికోసం ఏకంగా 6,650 కోట్లు అప్పు తీసుకోబోతున్నాడు. పిచ్చిరెడ్డి కంపెనీలలో 43% వాటాను కొనుగోలు చేయడానికి కృష్ణారెడ్డి రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికోసం కావాల్సిన డబ్బులను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇన్ఫ్రా రంగంలో తిరుగులేని స్థానంలో ఉన్నాడు కృష్ణారెడ్డి. పైగా ఆయన కంపెనీని మరింత విస్తరించబోతున్నాడు. చేతిలో గట్టిగానే ప్రాజెక్టులు ఉన్నాయి. అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి కృష్ణారెడ్డికి పట్టింది మొత్తం బంగారమే. ఒకవేళ పట్టుకోకున్నా బంగారమే. రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు ఇచ్చే ఆయనకు ఈ 6,650 కోట్లు ఒక లెక్కా.
ఓ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాలలో అత్యంత సంపన్నుల జాబితాలో కృష్ణారెడ్డి ముందు వరసలో ఉన్నారు. పైగా ఆయన త్వరలోనే మిగతా రంగాలకు కూడా తన వ్యాపారాలను విస్తరించే పనిలో ఉన్నారు. ఆయన భార్య సుధా రెడ్డి కూడా వ్యాపారం చేస్తున్నారు. కొడుకులు కూడా ఎదిగి వచ్చారు. దీంతో తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడానికి కృష్ణారెడ్డి పావులు కాదు.. వేలకోట్లను కదుపుతున్నాడు. ఆదాని మాదిరిగా దేశంలో కీలకమైన ప్రాజెక్టులను గుప్పిట్లో పెట్టుకోబోతున్నాడు.