Telangana politics: సరిగా కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూమికి సంబంధించి కొంతమంది తెలంగాణ వాదులు చేసిన హడావిడి మాములుగా లేదు. కొంతమంది యూట్యూబర్లు ప్రత్యేకంగా లోగోలు పట్టుకొని అక్కడికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేశారని.. కోడి చెరువును మొత్తం స్వాధీనం చేసుకున్నారని విమర్శలు చేశారు.
స్వయంగా ఈ వ్యవహారంలో హైడ్రా రంగనాథ్ తెరపైకి వచ్చారు. మొత్తంగా కోడి చెరువు వ్యవహారంలో జరిగిన అసలు విషయాన్నీ ఆయన వివరించారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఎటువంటి కబ్జాకు పాల్పడలేదని.. కనీసం అసైన్డ్ ల్యాండ్ కూడా కొనుగోలు చేయలేదని.. అదంతా కూడా చట్టబద్ధంగా జరిగిందని క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కోడి చెరువును ఆక్రమించారని ఆరోపణలు రావడంతో తాము రంగంలోకి దిగి.. అసలు వాస్తవాలను తెలుసుకొనే పనిలో పడ్డామని.. చివరికి పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆక్రమణకు పాల్పడలేదని అర్థమైందని హైడ్రా రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.
కోడి చెరువు విషయంలో పవన్ కళ్యాణ్ మీద కొంతమంది తెలంగాణ వాదులు.. కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. ఇంకా చాలామంది ఆరోపణలు చేశారు. కోడిచెరువు మొత్తం తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ కూడా చేశారు. తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టే అధికారం పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. పైగా అప్పట్లో పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి సమావేశం నిర్వహించుకుంటానని చెబితే.. తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వలేదు.
ఇప్పుడు కెసిఆర్ కుటుంబం ముఖ్యంగా కెసిఆర్ ఆధీనంలో వందల ఎకరాల భూమి ఉందని అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ భూమిని మొత్తం సర్వే చేస్తామని.. కెసిఆర్ పేరు మీద పట్టా భూమి కాకుండా.. ఇతర భూమి కనుక సర్వేలో తేలితే అక్కడి దళితులకు ఇస్తామని ప్రకటించారు. నిన్నటి నుంచి ఎరవల్లి వ్యవసాయ క్షేత్రంలో అధికారులు భూమికి సంబంధించి సర్వే నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కోడి చెరువు పక్కన ఉన్న భూమిని కొనుగోలు చేస్తేనే ఆక్రమించారని కొంతమంది తెలంగాణ వాదులు హంగామా సృష్టించారు. మరి ఇప్పుడు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం భూమిని ఆక్రమించింది అని చెబుతున్నారు. అధికారులు సర్వే కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రకారం నాడు హంగామా సృష్టించిన తెలంగాణవాదులు ఎక్కడికి వెళ్లినట్టు.. తెలంగాణలో భూములు ఆక్రమించారని ప్రభుత్వం చెబుతుంటే.. వీరంతా ఎందుకు నోరు మూసుకున్నట్టు.. దీనిని బట్టి వారు ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని తెలంగాణ వాదులు అంటున్నారు.. ఇదే సమయంలో ఆ తరహా నాయకుల మీద జనసేన నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నాడు పవన్ కళ్యాణ్ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వారంతా ఇప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు.