Amazon Great Indian Festival 2026 : పండగ సీజన్ మొదలయ్యేలోపే ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ సేల్స్‌తో సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ తేదీని ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. అంటే ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ కంటే ఒక రోజు ముందుగానే అమెజాన్ తన ఆఫర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈసారి అమెజాన్ వ్యూహం కేవలం భారీ డిస్కౌంట్లకే పరిమితం కాకుండా.. వినియోగదారులకు మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించడంపైనా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
కార్డులపై తక్షణ డిస్కౌంట్
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు చేసే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందించనుంది. అర్హత ఉన్న ఈఎంఐ లావాదేవీలకూ ఈ ప్రయోజనం వర్తించనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎంపిక చేసిన ఆఫర్లపై అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి.
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఫ్యాషన్, గృహోపకరణాలు, రోజువారీ అవసరాల ఉత్పత్తులపై కూడా ప్రత్యేక ధరలు ఉండనున్నాయి. ‘బ్లాక్‌బస్టర్ డీల్స్’, ‘టాప్ 100 డీల్స్’, ‘మెగా డీల్స్’, రాత్రి ప్రత్యేక డీల్స్ వంటి విభాగాల ద్వారా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.
అసలు హైలైట్.. షాపింగ్‌లో ఏఐ!
ఈసారి అమెజాన్ సేల్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత షాపింగ్ ఫీచర్లు. ఒకే రకమైన ఉత్పత్తులను సులభంగా పోల్చుకోవడం, ధరల మార్పులను అర్థం చేసుకోవడం, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సిఫార్సులు పొందడం వంటి అంశాల్లో ఏఐ టెక్నాలజీ ఉపయోగపడనుంది. దీంతో ఒక ఉత్పత్తి తక్కువ ధరకు దొరుకుతుందా? ప్రస్తుతం కొనడం మంచిదేనా? అనే విషయాలను వినియోగదారులు మరింత సులభంగా అంచనా వేసే అవకాశం ఉంటుంది.
డెలివరీ స్పీడ్ పెంచే ప్లాన్
భారీ సేల్ సమయంలో ఆర్డర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో అమెజాన్ తన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరిస్తోంది. 20 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 6 కొత్త సార్ట్ సెంటర్లు, 150 కొత్త లాస్ట్-మైల్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.అదే సమయంలో ‘అమెజాన్ నౌ’ క్విక్ కామర్స్ సేవలను దీపావళి నాటికి 100 నగరాలకు విస్తరించే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.
సేల్ కంటే ముందే మొదలైన పోటీ
అక్టోబర్ 8న అమెజాన్ సేల్ ప్రారంభం కాగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అక్టోబర్ 9 నుంచి మొదలు కానుంది. దీంతో పండగ షాపింగ్ కోసం సిద్ధమవుతున్న వినియోగదారులకు రెండు ప్రధాన ప్లాట్‌ఫామ్‌లలో ఆఫర్లను పోల్చుకునే అవకాశం లభించనుంది. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎంతకాలం కొనసాగుతుందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. సేల్ దగ్గరపడే కొద్దీ మరిన్ని ఉత్పత్తులు, డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ప్రైమ్ సభ్యుల ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.