BRS vs Congress : వంద కాదు, ఐదువందలు కాదు.. ఏకంగా వెయ్యి రోజుల కాంగ్రెస్ మార్క్ పాలనపై అసెంబ్లీ సాక్షిగా ‘ఛార్జ్‌షీట్’ దాఖలు చేసి, రేవంత్ ప్రభుత్వాన్ని కడిగిపారేద్దామని గులాబీ బాస్‌లు పక్కా స్కెచ్ వేశారు. నల్ల చొక్కాలు తొడిగి, చేతిలో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ గేటు ముందు కేటీఆర్, హరీశ్‌రావులు దిగిన సీన్ చూసి.. ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో ‘హైవోల్టేజ్ డ్రామా’ ఖాయం, కాంగ్రెస్ వికెట్ పడిపోవడం తథ్యం అని ప్రతిపక్ష శ్రేణులు తెగ మురిసిపోయాయి. తీరా కట్ చేస్తే.. అసలు కథ వేరేలా మారింది!
ఒక్క డైలాగ్.. అజెండా క్లోజ్!
ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారెంటీల బాకీల గురించి గళమెత్తాల్సిన చోట.. ‘తాతా మధు’ నోటి దురద పుణ్యమా అని కథ మొత్తం రివర్స్ తిరిగింది. పోలీసులతో తోపులాటలో ఆవేశం ఆపుకోలేక ఎమ్మెల్సీ గారు విసిరిన ఒక్క మాటతో.. కాంగ్రెస్‌కి బిగ్ ఆఫర్ దొరికినట్లయింది. “దళిత స్పీకర్‌ను అవమానిస్తారా?” అంటూ హస్తం నేతలు సెంటిమెంట్ కార్డు తీసి జనం మీదికి వదిలారు. ఇక అంతే! సభలో స్పీకర్ గారు కన్నీళ్లు పెట్టుకోవడం, కాంగ్రెస్ నేతలు ‘దళిత ఆత్మగౌరవం’ అంటూ రచ్చ చేయడం.. దీంతో బీఆర్ఎస్ తెచ్చిన ‘వెయ్యి రోజుల వైఫల్యాల’ అజెండా గాల్లో కలిసిపోయింది. ప్రభుత్వాన్ని కార్నర్ చేయాల్సిన గులాబీ నేతలు, చివరికి తమ నేత నోటిజారుడుకు సఫాయిలు చెప్పుకోవాల్సిన దయనీయ స్థితికి పడిపోయారు.
అరెస్టులు, అట్రాసిటీ కేసులు.. గులాబీ నేతల డిఫెన్స్ డ్రామా!
రెండో రోజు సీన్ ఇంకా రసవత్తరంగా మారింది. అర్థరాత్రి అరెస్టులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు డిమాండ్లు.. ఇలా సీన్ మొత్తం బీఆర్ఎస్ నేతలకు ఊపిరాడకుండా చేసింది. ఇక సీఎం రేవంత్‌పై కేటీఆర్ గారు పెంచిన “డోస్” ఏమైనా వర్కవుట్ అయిందా అంటే.. అదీ లేదు! ప్రత్యర్థిని దెబ్బకొట్టబోయి తామే మరింత ఆవేశపడి, కాంగ్రెస్ నేతల చేతికి మరో ఆయుధాన్ని అందించారు.
వచ్చిన అవకాశాన్ని వదిలేసి.. కాంగ్రెస్ ‘ట్రాప్’లో చిక్కుకున్నారా?
మరోవైపు, షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల వివాదం బీఆర్ఎస్‌కు పక్కా “గోల్డెన్ ఛాన్స్”. దాన్ని పట్టుకుని జనాల్లో సానుభూతి పిండుకోవాల్సిన చోట.. కేటీఆర్ కంపెనీ ఆవేశంలో ఊగిపోయి ఆ అవకాశాన్ని నీళ్లపాలు చేసుకుంది.
మొత్తానికి ‘ఛార్జ్‌షీట్’ పట్టుకుని కాంగ్రెస్‌ను కడిగేద్దామని వచ్చిన బీఆర్ఎస్.. చివరకు స్టేషన్ల చుట్టూ, కేసుల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకుంది. ప్రత్యర్థిని ఆవేశంలో ముంచి తప్పు చేయించడంలో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయితే.. ఉన్న అవకాశాలను వదిలేసుకుని గులాబీ దళం భలే ‘సెల్ఫ్‌గోల్’ వేసుకుందంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు!