YSRCP Kapu politics : కాపు అనే మాట వింటేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక పూనకం వస్తోంది. కాపు అంశాలను విడిచి పెట్టవద్దు అని అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు గట్టిగానే పిలుపునిచ్చారు. అందుకే కాపు అంశాలను చర్చించేందుకు తోట త్రిమూర్తుల నేతృత్వంలో కాపు నేతల విందు రాజకీయం ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కాపుల అంశాలపై రకరకాల ప్రయోగాలు జరగనున్నాయి ఏపీలో. ముద్రగడ పద్మనాభం ప్రయోగాలకు కాలం చెల్లి పోవడంతో ఇప్పుడు తోట త్రిమూర్తులను ప్రయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఓ సాధారణ కేసులో సాయి కృష్ణ అనే యువకుడు అరెస్టు కావడం.. తరువాత ఆయన అదృశ్యం కావడం.. వైయస్సార్ కాంగ్రెస్ దృష్టిలో పడింది. దానిని రాష్ట్రం గా మార్చి.. కాపులపై జరుగుతున్న దాడి అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టింది. ఒక్క సాయి కృష్ణ వ్యవహారం మాత్రమే కాదు.. మున్ముందు చాలా రకాల కాపు పరిణామాలు జరగనున్నాయని అర్థం అవుతోంది.
* అప్పట్లో ముద్రగడ ద్వారా..
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అక్కడ కు రెండేళ్లకే కాపు రిజర్వేషన్ ఉద్యమం ప్రారంభం అయింది. ముద్రగడ పద్మనాభం ప్రశ్నించడం ప్రారంభించారు. అలా ఆ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. గిన్నెల చప్పుడు, కంచాల చప్పుడుతో ముద్రగడ ఓ రేంజ్ లో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తీసుకెళ్లారు. తుని రైలు విధ్వంసం కేసుతో టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడేందుకు కారణమయ్యారు. అలా దూరమైన కాపులు టిడిపికి భారీ షాక్ ఇచ్చారు. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ పవన్ నేతృత్వంలోని కూటమికి దగ్గరయ్యారు. అయితే గతం మాదిరిగా కాపులపై ముద్రగడ పద్మనాభం ప్రయోగిస్తే వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. ఆ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తోట త్రిమూర్తులను రంగంలోకి దించుతున్నారు.
* గట్టి ఆలోచనతో జగన్..
ఇంకా ఎన్నికలకు మూడేళ్లు వ్యవధి ఉంది. ఇప్పటినుంచి కాపు అంశాన్ని తీసుకోకపోతే ఆ వర్గంలో చీలిక రాదు అని జగన్ భావిస్తున్నారు. అందుకే సాయి కృష్ణ లాకప్ డెత్ అని.. సాయి కృష్ణను చంపేశారు అంటూ లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. సాయి కృష్ణ పై 23 ఏళ్లకే అనేక రకాల క్రిమినల్ కేసులు ఉన్నాయి. కేసుల దర్యాప్తులో భాగంగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి సాయి కృష్ణ కనిపించడం లేదు. అయితే రాష్ట్రంలో ఇటువంటి చాలా కేసులు ఉన్నాయి. కానీ సాయి కృష్ణలో కనిపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపు యువకుడు కావడం. అది మొదలు టార్గెట్ చేయడం ప్రారంభించింది ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వాన్ని కాపులు నమ్మారు. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం కాపులను నట్టేట ముంచుతోంది అంటూ ఆరోపించడం మొదలుపెట్టారు.
* పవన్ సీరియస్..
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు ప్రయత్నాలను గట్టిగానే అడ్డుకోవాలని భావించారు. సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన చంద్రబాబును నేరుగా కలుసుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపారు ఇద్దరు నేతలు. సామాజిక వర్గాల మధ్య చీలికకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మున్ముందు వైసీపీ కాపు కుట్రలు మరిన్ని జరిగే అవకాశం ఉందని.. నిఘా వర్గాలను మరింత అప్రమత్తం చేయాలని సూచించారు. అయితే గతం మాదిరిగా వైసిపి కాపు అస్త్రాలు ఇప్పుడు పని చేసే ఛాన్స్ లేదు అన్నది విశ్లేషకులు మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
