Naga Babu: మెగా బ్రదర్ నాగబాబు మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఏడాదిన్నర కిందట ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తన క్యాబినెట్ లోకి తీసుకుంటానని సీఎం చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. అయితే ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకుతో కూడిన పదవిని నాగబాబుకు ఇచ్చారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఈకో లాజికల్ ఎన్ రిచ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నాగబాబును నియమించారు. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్ దండే జీవో జారీ చేశారు. ఇది పూర్తిగా క్యాబినెట్ ర్యాంకుతో కూడిన పదవి.
* రాజ్యసభ టార్గెట్..
రాజ్యసభ ద్వారా పెద్దల సభకు వెళ్లాలన్నది నాగబాబు ఆలోచన. జాతీయ రాజకీయాల పట్ల ఆయన ఆసక్తి చూపుతూ వచ్చారు. అయితే రాజ్యసభ పదవుల ఎంపిక సమయంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ వివిధ సమీకరణాల్లో భాగంగా ఆయనకు అవకాశం దక్కలేదు. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఏ సభలోను ఆయన సభ్యుడు కాదు. అందుకే గత ఏడాది మార్చిలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అటు తర్వాత మంత్రివర్గ విస్తరణలో నాగబాబుకు క్యాబినెట్ పదవి ఇస్తారని భావించారు. కానీ ఆ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మరోవైపు వివిధ సమీకరణలు మంత్రివర్గ విస్తరణకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. అందుకే ఇప్పుడు నాగబాబుకు క్యాబినెట్ ర్యాంకింగ్ తో కూడిన పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.
* ప్రత్యక్ష ఎన్నికల్లో..
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇదివరకే ప్రకటన చేశారు నాగబాబు. కానీ ఉత్తరాంధ్రలో ఒక నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగుతారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అందుకే తరచూ నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటిస్తుండడంతో.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది. అయితే మంత్రివర్గ విస్తరణ చేపడితే నాగబాబుకు తప్పకుండా ఛాన్స్ ఉంటుందన్న టాక్ కూడా ఉంది. అయితే ఎమ్మెల్సీ గాను పెద్దగా మాట్లాడడం లేదు నాగబాబు. రాజకీయ ఆరోపణలు, కామెంట్స్ కూడా చేయడం లేదు. మొన్న ఆ మధ్యన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు ఇదే విషయంపై హితబోధ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఎందుకు ఉపేక్షిస్తున్నారని.. గట్టిగా వారికి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా నేతలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. కానీ నాగబాబు ను మరింత యాక్టివ్ చేసే క్రమంలోనే క్యాబినెట్ ర్యాంకింగ్ తో కూడిన పదవి ఇచ్చినట్లు అర్థమవుతోంది. పైగా అటవీ శాఖ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. అందుకే ఆ శాఖకు సంబంధించిన బాధ్యతలు నాగబాబుకు అప్పగించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మంత్రి పదవి ఆశించిన నాగబాబుకు క్యాబినెట్ ర్యాంకింగ్ తో సరిపెట్టారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..