Nitin Nabin Team : బిజెపి జాతీయ కార్యవర్గంలో రాష్ట్ర నేతలకు స్థానం దక్కింది. ఏపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఆమెతో పాటు రాష్ట్రానికి చెందిన రామ్ మాధవ్ కు ఉపాధ్యక్ష పదవి దక్కింది. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డికి బిజెపి అనుబంధ విభాగాల సంయుక్త సమన్వయకర్తగా నియమించారు. భారతీయ జనతా పార్టీ జాతీయస్థాయిలో ఒక జంబో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఏపీ నుంచి ఓ ముగ్గురు నేతలకు మాత్రమే స్థానం దక్కడం విశేషం. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి అంతగా ప్రాతినిధ్యం దక్కలేదు జాతీయ కార్యవర్గాల్లో..
* సుదీర్ఘ నేపథ్యం..
దగ్గుబాటి పురందేశ్వరి బిజెపిలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. ప్రారంభంలో తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. అయితే చంద్రబాబుతో విభేదించి 2004లో భర్తతో కలిసి బయటకు వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2009లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ బలహీనం కాగా బిజెపి గూటికి వెళ్లారు. 2014 ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు దోహదపడ్డారు. ఆ ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది.
* మళ్లీ రామ్ మాధవ్ కు..
మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వారణాసి రామ్ మాధవ్ కు జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. 2014లో బిజెపిలో చేరారు రామ్ మాధవ్. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. అయితే 2020 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఆర్ఎస్ఎస్ కోసం పనిచేశారు. మళ్లీ ఇప్పుడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
* విష్ణువర్ధన్ రెడ్డికి..
మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డికి సైతం కీలక పదవి దక్కింది జాతీయస్థాయిలో. భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగాల సంయుక్త సమన్వయకర్తగా నియమితులయ్యారు. జాతీయస్థాయిలో చాలామంది సమన్వయకర్తలు ఉంటారు. అందులో విష్ణువర్ధన్ రెడ్డి ఒకరు. మొన్నటి ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. కనీసం రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కూడా లభించలేదు. ఇప్పుడు జాతీయస్థాయిలో పదవి దక్కడం ఆయనకు కొంత ఉపశమనం.