YS Jagan: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ప్రజా ఆందోళనలకు సిద్ధమవుతోంది. మరోవైపు ప్రజల్లోకి వచ్చేందుకు జగన్ ప్రణాళికలు వేస్తున్నారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ, జగన్ పాదయాత్ర మొదలు కానుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. లేకుంటే కూటమిని తట్టుకోలేమన్న ఆలోచనకు వచ్చారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వ వైఫల్యాలను చాటి చెప్పడం, డిజిటల్ మీడియా ద్వారా ప్రచారం ఇలా అన్ని వ్యూహాలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అన్నింటికీ మించి బలమైన వ్యూహకర్త నియామకంపై జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
* ఆ ఇద్దరి సేవలు..
2019లో ప్రశాంత్ కిషోర్ టీం, 2024 ఎన్నికల్లో రుషిరాజ్ సింగ్ టీం సేవలందించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమితో రాజకీయ వ్యూహకర్తతో ఒప్పందం రద్దు చేసుకున్నారు. అందుకే ఇప్పుడు కొత్త వ్యూహకర్త నియామకంపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ జరగనుంది. ఆపై జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఆ సమయానికి విపరీత రాజకీయ వ్యూహాలు అవసరం. అందుకే సమర్ధుడైన వ్యూహకర్తను రంగంలోకి దించేందుకు జగన్ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
* కపిల్ సాహు తో చర్చలు..
అయితే ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా కపిల్ సాహు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో విజయ్ గెలుపు కోసం కృషి చేశారు కపిల్ సాహు. కేవలం రెండేళ్ల ముందు వ్యూహకర్తగా నియమితులై.. అంచనాలు లేని, అద్భుత విజయాన్ని ఆయనకు అందించారు. అయితే విజయ్ తో జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్నేహంతో కొంతమంది సన్నిహితులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కపిల్ సాహు తో కీలక చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..