Jogi Ramesh Family Dispute : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జోగి రమేష్ కుటుంబ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. గత కొంతకాలంగా ఆ కుటుంబంలో పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే. తనపై గృహహింసకు పాల్పడుతున్నారంటూ జోగి రమేష్ కోడలు, జోగి రాజీవ్ భార్య మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాదిగా తనను హింసిస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 11 మంది కుటుంబ సభ్యులపై ఆమె ఫిర్యాదు చేశారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే మేఘన పుట్టినిల్లు సూర్యాపేట. అయితే తాజాగా ఇరు కుటుంబాల మధ్య జరిగిన పంచాయితీ దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగు చూసాయి. విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్.
* ఏడాది కిందట వివాహం..
ఏడాది కిందట జోగి రమేష్ తన కుమారుడు రాజీవ్ కు సూర్యాపేటకు చెందిన మేఘనతో వివాహం చేయించారు. అయితే ఏడాది పాటు తనను కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టారని మేఘన ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. పోలీసులు గృహహింస కింద కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల ఇరు కుటుంబాలు కొంతమంది పెద్దలతో కలిసి సమావేశమైనట్లు తెలుస్తోంది. అయితే జోగి రాజీవ్ తన తల్లిదండ్రులను తప్పుపడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తరుణ్ వైట్ వాష్ చేసి పెళ్లికి ఒప్పించారని ఆయన చెబుతుండగా.. మరోవైపు మేఘన తనకు ఏడాది పాటు నరకం చూపించారని.. చంపేందుకు ప్రయత్నించారంటూ ఆరోపించారు. అయితే ఇరు కుటుంబాల వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎవరు తీసారో తెలియదు కానీ ఈ వీడియోలు మీడియాకు అందాయి. దీంతో సోషల్ మీడియా కూడా కూస్తుండగా.. ప్రధాన మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి.
* రాజకీయంగా దూకుడు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పని చేశారు జోగి రమేష్. రాజకీయంగా చాలా దూకుడుగా ఉండేవారు. ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా విమర్శలు చేసేవారు. ఇప్పుడు ఆయన కుటుంబ వ్యవహారం బయటకు రావడంతో పెద్ద ట్రోలింగ్ అవుతోంది సోషల్ మీడియాలో.. అయితే కోడలు మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణించారు జోగి రమేష్. అయితే ఇప్పుడు నేరుగా వారి మధ్య జరిగిన పంచాయితీ బయటకు రావడం.. అటు కుమారుడు సైతం తిరగబడటం… కోడలు తరుపు కుటుంబ సభ్యులు సైతం కార్నర్ చేస్తుండడంతో జోగి రమేష్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే గతంలో ఆయనతో పాటు కుమారుడు చేసిన వ్యాఖ్యలను జోడిస్తూ.. కర్మ రిటర్న్ అంటూ ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు.