Chenab River: శత్రువును చంపాలంటే బుల్లెట్లు మాత్రమే వాడాల్సిన అవసరం లేదు. తుపాకులే ఉపయోగించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆనుపానులు తెలుసుకుంటే చాలు. అక్కడ ఒత్తితే కథ మొత్తం మారుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే చేస్తున్నారు.. నోట్ల రద్దుతో పాకిస్తాన్ దొంగ నోట్ల ముఠా ఆట కట్టించారు. ఆర్టికల్ 370 రద్దు తో పాకిస్తాన్ గుండెల మీద తన్నారు. పాకిస్తాన్ దేశంలో తలదాచుకుంటున్న ఉగ్రవాదులను బయటి ప్రపంచానికి చూపారు. తర్వాత వారిలో వారే కాల్చుకొని చచ్చారు. ఉగ్రవాద తండాలకు ఆలవాలమైన పాకిస్తాన్ కు బయటి దేశాల నుంచి ఆర్థిక సహాయం అందకుండా చేశారు. దీనికి అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మోడీకి సహకరించారు. మానవత సహాయం పేరుతో వివిధ దేశాల నుంచి భారీగా నిధులు పాకిస్తాన్ రావడం.. పాకిస్తాన్ ఆ నిధులను ఉగ్రవాదులకు చేరవేయడం వంటివి జరిగేవి. ఇలా దండిగా నిధులు వస్తుండడంతో ఉగ్రవాదులు భారత్లో విధ్వంసకర చర్యలకు పాల్పడేవారు. ఇలాంటి ఉగ్రవాద దాడులను అనేకం భరించిన భారత్.. ఆ నష్టాన్ని ఇప్పటికీ పూడ్చుకోలేకపోయింది. అయితే ఉగ్రవాద మూలాలను.. దానికి అందుతున్న నిధులను అమెరికాలోనే కట్టడి చేశాడు నరేంద్ర మోడీ. డోనాల్డ్ ట్రంప్ సహకారంతో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విభాగంలోకి మానవతా సహాయం పేరుతో వచ్చే నిధులను చేర్చారు. ఫలితంగా ఇతర దేశాల నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి పాకిస్తాన్ కు నిధులు రావడం తగ్గిపోయింది. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులకు డబ్బులు రావడం ఆగిపోయింది. ఇక ఆ తర్వాత చెప్పాల్సిన పనిలేదు.
ఆర్టికల్ 370 రద్దు తో జమ్మూ కాశ్మీర్లో వేర్పాటు వాద ఉద్యమాలు తగ్గిపోయాయి. ఉగ్రవాదుల కార్యకలాపాలు కూడా సద్దుమణిగాయి. గతంలో ఉగ్రవాద భావజాల వ్యాప్తికి కారణమైన వారిని నరేంద్ర మోడీ ప్రభుత్వం జైల్లో పెట్టింది. ఉగ్రవాదులకు సహకరిస్తున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది. వారిపై రకరకాల కేసులు పెట్టి జైలు పాలు చేసింది. మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతమైన వాతావరణానికి కృషి చేసింది. అయినప్పటికీ అప్పుడప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు ఉన్న నేపథ్యంలో… పాకిస్తాన్ దేశంతో ఎప్పటికైనా ప్రమాదమే అని భావించిన భారత ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్ దేశాన్ని అన్ని విధాలు దెబ్బ కొడుతున్న భారత్.. తాజాగా తీసుకున్న నిర్ణయం మరింత ఇబ్బందుల పాలు చేసేలా ఉంది.
పాకిస్తాన్ దేశం ప్రస్తుతం దివాలా తీసింది. అన్ని రంగాలు పాతాళానికి పడిపోయాయి. మూడు పూటలా తింటే అదే గొప్ప అనుకునే రోజులు అక్కడ దాపురించాయి. ఇతర దేశాల నుంచి అప్పు పుడితే చాలు అదే మహాభాగ్యం అనుకునే స్థితి అక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని మరింత దెబ్బ కొట్టే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ దానిని అమలులో పెట్టారు కూడా. పాకిస్తాన్ దేశానికి సింధూ నది ప్రవాహం అత్యంత ముఖ్యం. ఈ నది మీదే పాకిస్తాన్ దేశం వ్యవసాయం ఆధారపడి ఉంది. సింధూ నది ప్రవాహం కొనసాగాలంటే జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నది ప్రవహించాలి. అయితే ఇప్పుడు ఈ చీనాబ్ నది మీద కేంద్రం ఒక ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుతో 850 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. అంతేకాదు ఈ నది నీటిని జమ్మూ కాశ్మీర్లో వ్యవసాయ రంగానికి మళ్ళించనుంది. దీనివల్ల 5000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సింధూ నది దాదాపుగా ఎండిపోతుంది లేదా తక్కువ స్థాయిలో ప్రవహిస్తుంది. అప్పుడు పాకిస్తాన్ వ్యవసాయ రంగం చిన్నా భిన్నమవుతుంది. ఇప్పటికే అన్ని విధాలుగా పాకిస్తాన్ దేశాన్ని దెబ్బ కొట్టిన నరేంద్ర మోడీ.. తాజాగా చీనాబ్ నది మీద ప్రాజెక్టుతో దాయాది దేశం కడుపు మీద కొడుతున్నాడు.