Rafale Fighter Jets : భారత ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాల కొరతను తీర్చడానికి ఫ్రాన్స్ సమర్పించిన రూ.3.25 లక్షల కోట్ల రఫేల్ ప్రతిపాదన కేవలం కొనుగోలు ఒప్పందం మాత్రమే కాదు. ఇది మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ దిశగా ముఖ్యమైన అడుగు. 114 జెట్లలో 94 దేశంలోనే తయారు చేస్తామని ఫ్రాన్స్ తెలిపింది. దీంతో టెక్నాలజీ బదిలీ, స్థానిక ఉత్పత్తి, పరిశ్రమలకు భారీ అవకాశాలు కలుగుతాయి.
ఆత్మనిర్భరతకు ఊతం
ఫ్రాన్స్ ప్రతిపాదన ప్రకారం మొత్తం 114 రఫేల్ జెట్లలో 94 భారత్‌లోనే ఉత్పత్తి అవుతాయి. కొన్ని విమానాలు ఫ్లై–అవే కండిషన్‌లో వస్తాయి, మిగతావి దేశీయ భాగస్వామ్యంతో తయారవుతాయి. ఇది గత రఫేల్ ఒప్పందాలకు భిన్నంగా, మొట్టమొదటిసారి రఫేల్‌ను ఫ్రాన్స్ వెలుపల పెద్ద ఎత్తున తయారు చేయబోతోంది. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఎయిర్‌ఫ్రేమ్, ఇంజిన్లు, అవయోనిక్స్‌లో స్థానిక కంటెంట్ 60 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల భారత్ స్వయంప్రతిపత్తి పెరుగుతుంది, భవిష్యత్తులో సొంత యుద్ధ విమానాల అభివృద్ధికి అనుభవం లభిస్తుంది.
స్థానిక పరిశ్రమలకు ఊతం..
ఈ ఒప్పందం ఆమోదమైతే భారతీయ కంపెనీలకు దాదాపు రూ.1.6 లక్షల కోట్ల వ్యాపారం వస్తుందని అంచనా. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లార్సెన్ – టూబ్రో వంటి సంస్థలు ఎయిర్‌ఫ్రేమ్, ఇంజిన్ అసెంబ్లీ, అవయోనిక్స్, ఆయుధాల ఇంటిగ్రేషన్‌లో పాల్గొంటాయి. ఫ్రెంచ్ కంపెనీలు డసాల్ట్, సఫ్రాన్, థేల్స్, ఎంబీడీఏ భారత భాగస్వాములతో కలిసి పనిచేస్తాయి. ఇది ఏరోస్పేస్ సప్లై చైన్‌ను బలోపేతం చేసి, ఉపాధి సృష్టి, నైపుణ్య అభివృద్ధికి దోహదం చేస్తుంది. స్థానిక ఆయుధాలు ఇంటిగ్రేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
హైదరాబాద్‌కు ప్రత్యేక ప్రాధాన్యం
రఫేల్ విడిభాగాల తయారీ కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటవుతుంది. ఇప్పటికే టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌తో ఫ్యూజ్‌లేజ్(ఫ్యూస్‌లేజ్) తయారీ ఒప్పందాలు ఉన్నాయి. ఇది హైదరాబాద్‌ను ఏరోస్పేస్ హబ్‌గా మరింత బలపరుస్తుంది. ఇంజన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్(ఎంఆర్‌వో) సౌకర్యాలు కూడా ఇక్కడే రావచ్చు. దీనివల్ల తెలంగాణలో ఉపాధి, పెట్టుబడులు పెరుగుతాయి.
వ్యూహాత్మక ప్రయోజనాలు..
భారత వాయుసేన స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఈ జెట్లు ముఖ్యం. ప్రస్తుతం ఉన్న 36 రఫేల్‌లకు జోడించి మొత్తం సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 4.5 జనరేషన్ మల్టీ–రోల్ సామర్థ్యం, ఆధునిక ఆయుధ వ్యవస్థలు శత్రు దేశాలపై నిరోధక శక్తిని పెంచుతాయి. టెక్నాలజీ బదిలీతో భవిష్యత్తు స్వదేశీ విమానాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.
ప్రతిపాదనను రక్షణ శాఖ, వాయుసేన పరిశీలిస్తున్నాయి. ధర, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ స్థాయి, ఇండిజినస్ కంటెంట్, ఆయుధాల ఇంటిగ్రేషన్‌పై చర్చలు జరుగుతాయి. ఒప్పందం ఆమోదమైతేనే పూర్తి ప్రయోజనాలు వస్తాయి. ఈ ప్రతిపాదన భారత్ రక్షణ సామర్థ్యం పెంచడంతోపాటు ఆర్థిక, పారిశ్రామిక లబ్ధిని కలిగిస్తుంది. భారత–ఫ్రాన్స్ రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది.