Mukti Bhavan : సాధారణంగా ఏవరైనా ప్రత్యేక ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు హోటల్ బుక్ చేసుకుంటారు. ఇందులో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. లేదా కొన్ని రోజుల పాటు ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ఓ హోటల్ కేవలం మరణించే వారికి మాత్రమే. త్వరలో చనిపోయే వారి కోసమే దీనిని నిర్మించారు. ఇక్కడికి వచ్చిన వారు కొన్ని రోజుల్లో మరణిస్తారు.. !అంటే తమ చావు త్వరలో అని తెలిసిన వారు ఈ హోటల్ లో బస చేయవచ్చు. ఇంత విచిత్రమైన హోటల్ ఎక్కడుంది? ఎందుకు ఇలా దీనిని నిర్మించారు?
‘ముక్తి భవన్’ గురించి చర్చ..
భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటైన వారణాసిలో ఉన్న ‘ముక్తి భవన్’ గురించి ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇది సాధారణ హోటల్ కాదు. జీవితపు చివరి రోజులను గడిపేందుకు.. కాశీలోనే చివరి శ్వాస విడిచి మోక్షం పొందాలనే వారికి నిర్మించింది. వారణాసిలో గంగానది ఒడ్డుపై ఉన్న ముక్తి భవన్ దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సేవా సంస్థ. దీనిని కొందరు “కాశీ లాభ్ ముక్తి భవన్” అని కూడా పిలుస్తారు. దీని ప్రధాన ఉద్దేశం మరణం సమీపించిందని భావించే వృద్ధులకు తాత్కాలికంగా నివాసం కల్పించడం. ఇక్కడికి వచ్చే వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి చివరి రోజులను ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. భవనంలో భజనలు, వేద మంత్రాల పఠనం, పూజలు వంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి.
14 రోజులు మాత్రమే అనుమతి..
ముక్తి భవన్‌లో గదుల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. అందుకే సాధారణంగా ఒక వ్యక్తికి గరిష్ఠంగా 14 రోజుల పాటు మాత్రమే ఉండేందుకు అనుమతి ఇస్తారు. ఈ కాలంలో వ్యక్తి మరణిస్తే అక్కడే చివరి కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే 14 రోజుల తర్వాత కూడా ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంటే లేదా మరణం సంభవించకపోతే, ఇతరులకు అవకాశం కల్పించేందుకు భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాహకులు కొద్దిరోజులు అదనపు గడువు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతారు.
దేశం నలుమూలల నుంచి..
హిందూ పురాణాలు, శైవ సంప్రదాయం ప్రకారం కాశీ అనేది పరమశివుని క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ మరణించిన వారికి భగవంతుని కృపతో మోక్షం లభిస్తుందని అనేక మంది విశ్వసిస్తారు. ఈ విశ్వాసమే దేశం నలుమూలల నుంచి వృద్ధులను, వారి కుటుంబాలను ముక్తి భవన్‌కు తీసుకొస్తుంది.
40 ఏళ్లలో 12 వేల మందికి పైగా..
ముక్తి భవన్ నిర్వాహకుల్లో ఒకరైన వ్యక్తి మీడియాతో పలు సందర్భాల్లో మాట్లాడుతూ, తాను దాదాపు 40 సంవత్సరాలుగా ఈ సేవలో ఉన్నానని, ఆ కాలంలో 12 వేల మందికిపైగా చివరి శ్వాస విడిచిన దృశ్యాలను ప్రత్యక్షంగా చూశానని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి చివరి క్షణాల్లో జీవితం గురించి లోతుగా ఆలోచిస్తారని, అనేక భావోద్వేగాలను వ్యక్తం చేస్తారని ఆయన వివరించారు.
చివరి క్షణాల్లో పశ్చాత్తాపం..
నిర్వాహకుడి అనుభవాల ప్రకారం, జీవితమంతా కోపం, అహంకారం, చిన్నచిన్న విభేదాలతో గడిపిన చాలామంది చివరి క్షణాల్లో వాటి గురించి తీవ్రంగా పశ్చాత్తాపపడతారు. ‘ఎందుకు అంత కోపం చేశాం? ఎందుకు మనుషులను బాధపెట్టాం?’ అనే భావన వారిలో కనిపిస్తుందని ఆయన చెబుతారు. సంపద, హోదా, ఆస్తుల కంటే మనుషులతో ఉన్న అనుబంధాలే చివరికి గుర్తుకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఎప్పటికోపాన్ని అప్పుడే..
ముక్తి భవన్‌లో ఎన్నో మరణాలను చూసిన అనుభవంతో నిర్వాహకుడు ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని చెబుతారు. రోజులో వచ్చిన కోపాన్ని, ద్వేషాన్ని, మనసులోని బాధను అదే రోజులో వదిలేయాలని ఆయన సూచిస్తారు. ఎందుకంటే జీవితానికి ఎప్పుడు ముగింపు వస్తుందో ఎవరికీ తెలియదు. క్షమించడం, ప్రేమగా మాట్లాడడం, బంధాలను కాపాడుకోవడం వంటి విలువలే చివరికి మనసుకు ప్రశాంతతను ఇస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు.