Home Loan: సొంత ఇల్లు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి లక్ష్యం. ఈ ఇల్లు కోసం కొందరు ప్రాణాలనే పణంగా పెడుతూ ఉంటారు. అంటే తమ సంపాదనలో సింహాభాగం దీనికే ఖర్చు చేస్తారు. నేటి కాలంలో చాలా మంది లోన్ ద్వారా ఇల్లును కొనుగోలు చేస్తున్నారు. మిగతా రుణాల కంటే ఇంటి లోన్ పై వడ్డీ చాలా తక్కువ. కానీ ప్రణాళిక లేకుండా ఈ లోన్ తీసుకుంటే మొదటికే మోసం అవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఇంటి రుణం తీసుకునే వారు ముందుగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. బ్యాంకు మీకు ఎంత లోన్ ఇస్తుందన్నది ముఖ్యం కాదు.. మీరు ఎంత సౌకర్యవంతంగా తిరిగి చెల్లించాలి అన్నది ముఖ్యం. మీ నెలవారీ ఆదాయంలో అధిక శాతం ఈఎంఐ కే వెళ్లిపోతే ఇతర అవసరాలకు డబ్బు మిగలదు. ఈఎంఐ తో పాటు ఇతర రుణాలు, రోజువారీ ఖర్చులు కలిపి కుటుంబ ఆదాయంపై ఎక్కువ భారం పడకుండా చూసుకోవాలి.
ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు డౌన్ పేమెంట్ కోసం ఉన్న పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయడం మరో పెద్ద తప్పు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, ఇంటీరియర్, ఫర్నిచర్, షిఫ్టింగ్ వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. వీటితో పాటు అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా ఉంచుకోవాలి. డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత చేతిలో నగదు లేకుండా పోతే.. చిన్న ఆర్థిక సమస్య వచ్చినా క్రెడిట్ కార్డు లేదా వ్యక్తిగత రుణాలపై ఆధారపడాల్సి రావచ్చు.
ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో ఆదాయం తగ్గడం, కుటుంబంలో అనుకోని ఖర్చులు రావడం వంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందు లేదా తీసుకున్న తర్వాత కనీసం కొన్ని నెలల కుటుంబ ఖర్చులు, ఈఎంఐలను భరించగలిగే ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.
ఇల్లు కొన్న తర్వాత ఖర్చులు తగ్గిపోతాయని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి పిల్లల స్కూల్ ఫీజులు, ఉన్నత విద్య, వివాహం, వైద్య ఖర్చులు, వాహనం కొనుగోలు, తల్లిదండ్రుల అవసరాలు వంటి ఖర్చులు భవిష్యత్తులో పెరుగుతాయి. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా మొత్తం పొదుపును ఇంటిపైనే పెట్టుబడి పెడితే తర్వాత ఆర్థిక ఒత్తిడి పెరగవచ్చు.