Home Loan : ఇల్లు కొనుగోలు చేయాలనుకునే చాలామందికి ఉంటుంది. కానీ ఈ ఇంటి కోసం చేసిన అప్పును వెంటనే తీర్చేయాలని అనుకుంటారు. దీంతో తమకు వచ్చే మొత్తం ఆదాయాన్ని ఇంటి రుణం కోసం కేటాయిస్తారు. అయితే హోమ్ లోన్‌తో పాటు ప్రతి నెల కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ప్రత్యేకంగా సంపదను సృష్టించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నవారు లోన్ చెల్లింపుతో పాటు పెట్టుబడిని కొనసాగించడం చాలా అవసరం. దీని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం..
ఉదాహరణకు రూ.50 లక్షల హోమ్ లోన్‌ను 20 ఏళ్ల కాలానికి 8.5 శాతం వార్షిక వడ్డీతో తీసుకున్నట్లు అనుకుందాం. ఈ పరిస్థితిలో నెలవారీ ఈఎంఐ సుమారు రూ.43,391గా ఉంటుంది. 20 ఏళ్లలో మొత్తం చెల్లింపు సుమారు రూ.1.04 కోట్లు అవుతుంది. ఇందులో దాదాపు రూ.54.14 లక్షలు వడ్డీగా చెల్లించాల్సి వస్తుంది. అయితే వాస్తవ ఈఎంఐ మాత్రం బ్యాంకు వడ్డీ రేటు, రుణ కాలం, రేటు మార్పులు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
అదే వ్యక్తి ప్రతి నెల రూ.5,000ను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో సిప్‌గా పెట్టుబడి పెడుతున్నాడని అనుకుందాం. 20 సంవత్సరాల పాటు పెట్టుబడి కొనసాగిస్తే అతను స్వయంగా పెట్టే మొత్తం రూ.12 లక్షలు మాత్రమే. సగటున 10 శాతం వార్షిక రాబడి వస్తే సుమారు రూ.38 లక్షలు, 12 శాతం సగటు రాబడి వస్తే సుమారు రూ.49.5 లక్షలు అవుతుంది. 12 శాతం రాబడి ఉదాహరణలో పెట్టుబడిపై లాభం సుమారు రూ.37.5 లక్షలు. ఇవి కేవలం లెక్కల కోసం చూపించిన అంచనాలు మాత్రమే.అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ పెంచుకోవడం లేదా ఈఎంఐని తగ్గించుకొని సమానంగా ఏర్పాటు చేసుకుంటే వడ్డీ లేకుండా చేసుకోవచ్చు.
కొంత మందికి ముందుగా లోన్ తీర్చాలా? లేక సిప్ కొనసాగించాలా? అన్న సందేహం ఉంటుంది. అయితే ఇది వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. హోమ్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే, అదనపు డబ్బును కొంత మేర లోన్ ప్రీపేమెంట్‌కు ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉండొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో చెల్లించాల్సిన వడ్డీ తగ్గుతుంది. మరోవైపు, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టకుండా మొత్తం డబ్బును లోన్ ప్రీపేమెంట్‌కే ఉపయోగిస్తే భవిష్యత్తులో ప్రత్యేక పెట్టుబడి కార్పస్ లేకపోవచ్చు.
అందుకే చాలామందికి ఒకేసారి రెండు లక్ష్యాలను కొనసాగించడం సమతుల్య విధానంగా ఉంటుంది. అంటే నిర్ణీత ఈఎంఐని క్రమం తప్పకుండా చెల్లిస్తూ, ఆదాయానికి అనుగుణంగా చిన్న మొత్తంతో సిప్ కొనసాగించడం. అదనపు బోనస్, జీతం పెంపు లేదా ఇతర ఆదాయం వచ్చినప్పుడు కొంత మొత్తాన్ని హోమ్ లోన్ ప్రీపేమెంట్‌కు కేటాయించవచ్చు.