Social Media Influencers : కొన్ని సంస్థలు, కంపెనీలు ప్రచారం చేసుకునేందుకు సోషల్ మీడియాను ఎందచుకుంటున్నాయి. ఇందులోని ఇన్ ఫ్లుయెన్సర్స్ సైతం ఆదాయం పెంచుకునేందుకు కొన్ని ప్రత్యేక ప్రొడక్ట్స్ ను విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. చాలా మంది ఇలా వాటి గురించి తెలుసుకొని వస్తువులు, ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. ఇలా ప్రచారం చేసేవారిని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI )’ హెచ్చరించింది. ఉత్పత్తుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
కొందరు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆహార పదార్థాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఉత్పత్తుల గురించి ధ్రువీకరించని ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేయొద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆహారపదార్థాల్లోని ‘ఇమ్యూనిటీ’ ‘పోషకాలు అధికంగా ఉన్నాయి’ వంటి వాటి గురించి నిజానిజాలను పరిశీలించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది.
ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నప్పుడు దాని ప్యాకేజింగ్‌పై ఉన్న వివరాలు, పోషక విలువలు, తయారీదారు చేస్తున్న ఆరోగ్య క్లెయిమ్స్ వంటి అంశాలను ఇన్‌ఫ్లుయెన్సర్లు పరిశీలించాలి. కేవలం బ్రాండ్ చెప్పిందని లేదా డబ్బులు తీసుకుని నిర్ధారణ లేని ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు చెప్పకూడదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం ఫుడ్‌కు సంబంధించిన క్లెయిమ్స్ నిజమైనవి, స్పష్టమైనవి, అర్థవంతమైనవి, వినియోగదారులను తప్పుదోవ పట్టించనివిగా ఉండాలి.
ఒక ఆహార పదార్థం లేదా దానిలోని ఏదైనా పదార్థం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పే హెల్త్ క్లెయిమ్స్‌కు తగిన శాస్త్రీయ ఆధారాలు ఉండాలి. గతంలో కూడా ఫుడ్ ప్రొడక్టులపై తప్పుడు లేదా అతిశయోక్తి ఆరోగ్య క్లెయిమ్స్ అనుమతించబోమని స్పష్టం చేసింది. ఒక ఉత్పత్తిలో ప్రొటీన్, విటమిన్లు లేదా మరేదైనా పోషక పదార్థం ఉన్నంత మాత్రాన దాన్ని మొత్తం ఆరోగ్యకరమైన ఆహారంగా చిత్రీకరించడం సరైనది కాదు. ఇదొక్కటే ‘ఆరోగ్యకరమైనది’గా చూపకుండా, సమతుల్య ఆహారం, పండ్లు, కూరగాయలు, శారీరక శ్రమ వంటి అంశాలతో కలిపి ఆహారాన్ని చూడాల్సి ఉంటుంది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉంటారు. వారు ఒక ఫుడ్‌ను ఇమ్యూనిటీ పెంచుతుంది.. ప్రొటీన్ లోపాన్ని తీరుస్తుంది లేదా ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెబితే, చాలామంది వినియోగదారులు దాన్ని నిపుణుల సలహాగా భావించే అవకాశం ఉంటుంది. అందుకే ఫాలోవర్లను ప్రభావితం చేసే వ్యక్తులు ఉత్పత్తి గురించి చెప్పే ప్రతి ఆరోగ్య క్లెయిమ్ విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.