Srinivas Nimmagadda : అట్లాంటా: ఒకప్పుడు ఇంటి బేస్‌మెంట్‌లో చిన్న సంస్థను ప్రారంభించిన ఓ భారతీయుడు.. ఇప్పుడు అమెరికాలో భారతీయ ఆహార సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని అందుకున్న శ్రీనివాస్ నిమ్మగడ్డ (నిమ్స్).. ఇప్పుడు రెస్టారెంట్ వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా జార్జియా రాష్ట్రం అరుదైన గౌరవాన్ని అందించింది. సంక్రాంతి ఇండియన్ కిచెన్ వ్యవస్థాపకుడైన నిమ్స్‌ను జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్‌పర్జర్ ‘అవుట్‌స్టాండింగ్ జార్జియా సిటిజన్’గా ప్రకటించారు.
జార్జియా స్టేట్ క్యాపిటల్‌లో ఈ మేరకు ప్రత్యేక సర్టిఫికెట్‌ను అందజేశారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా జార్జియా రాష్ట్రానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నిమ్మగడ్డను గుర్తించడం ఈ గౌరవంలోని ప్రత్యేకత. ఒక భారతీయ పారిశ్రామికవేత్తగా ఆయన సాధించిన విజయాలకు ఇది మరో మైలురాయిగా నిలిచింది.
బేస్‌మెంట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి..
నిమ్మగడ్డ విజయ ప్రస్థానం 2001లో ప్రారంభమైంది. కనెక్టికట్‌లోని తన ఇంటి బేస్‌మెంట్‌లో వెన్సాయ్ టెక్నాలజీస్ పేరుతో తొలి సంస్థను ప్రారంభించారు. చిన్న స్థాయిలో మొదలైన ఈ సంస్థను క్రమంగా భారత్, దుబాయ్, ఖతార్‌లలో కార్యాలయాలు కలిగిన బహుళజాతి ఐటీ కంపెనీగా అభివృద్ధి చేశారు. వ్యాపారంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
అయితే అక్కడితో ఆయన ప్రయాణం ఆగలేదు. భారతీయ ఆహారానికి అమెరికాలో మరింత విస్తృతమైన మార్కెట్‌ను సృష్టించాలనే ఆలోచనతో 2018లో సంక్రాంతి ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
చిపోటిల్, కావా తరహాలో భారతీయ బ్రాండ్ లక్ష్యం!
అమెరికాలో మెక్సికన్ ఆహారానికి చిపోటిల్, మెడిటరేనియన్ వంటకాలకు కావా వంటి సంస్థలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. అదే తరహాలో భారతీయ వంటకాలకు కూడా ఒక బలమైన క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) బ్రాండ్ ఉండాలన్నది నిమ్మగడ్డ లక్ష్యం.
భారతీయ ఆహారాన్ని కేవలం ప్రత్యేక రెస్టారెంట్లకే పరిమితం చేయకుండా.. సాధారణ అమెరికన్లకు సైతం వేగంగా, తాజాగా, అసలైన రుచులతో అందించాలన్న ఆలోచనతో సంక్రాంతి ఇండియన్ కిచెన్‌ను తీర్చిదిద్దారు.
ఈ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం కాలేదు. భారతీయ వంటకాల రుచి, నాణ్యతను కాపాడుతూనే వేగంగా ఆహారాన్ని అందించే విధానాన్ని రూపొందించడానికి ఐదేళ్లపాటు ప్రయోగాలు, కఠినమైన పరీక్షలు నిర్వహించారు. చివరకు సమర్థవంతమైన వ్యాపార నమూనాను అభివృద్ధి చేశారు.
అట్లాంటా నుంచి అమెరికా అంతటా విస్తరణకు ప్లాన్!
ప్రస్తుతం అట్లాంటా మిడ్‌టౌన్‌లో సంక్రాంతి ఇండియన్ కిచెన్ QSR కార్యకలాపాలు కొనసాగిస్తోంది. త్వరలోనే బక్‌హెడ్, డౌన్‌టౌన్ అట్లాంటా ప్రాంతాల్లో మరో రెండు రెస్టారెంట్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు, జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో ప్రతినెలా జరిగే కార్యక్రమాలకు కూడా ఆహార సేవలను అందిస్తోంది.
దేశంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఈ ప్రాంగణానికి అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ఈ ఏడాది వేసవిలో అట్లాంటాలో నిర్వహించిన ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్‌లోనూ వేలాది మంది అంతర్జాతీయ సందర్శకులకు సంక్రాంతి ఇండియన్ కిచెన్ భోజనాన్ని అందించింది. దీంతో భారతీయ వంటకాలను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేసే అవకాశం లభించింది.
2027 నుంచి ఫ్రాంచైజీ మోడల్‌లో దూకుడు!
అట్లాంటాలో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకున్న సంక్రాంతి.. తదుపరి దశలో పొరుగు రాష్ట్రాలకు విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2027 నుంచి ఫ్రాంచైజీ విధానంలో కొత్త రెస్టారెంట్లను ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. ఈ ప్రణాళిక అమలైతే అమెరికాలో భారతీయ ఆహారానికి మరింత విస్తృతమైన మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది.
ఒకవైపు ఐటీ రంగంలో అంతర్జాతీయ సంస్థను నిర్మించడం.. మరోవైపు భారతీయ ఆహారాన్ని అమెరికా ప్రధాన స్రవంతిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం నిమ్మగడ్డ వ్యాపార దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తోంది.
తనకు లభించిన గౌరవంపై స్పందిస్తూ.. ఈ గుర్తింపు ఎంతో విలువైనదని నిమ్మగడ్డ పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే, ఇది ఒక పారిశ్రామికవేత్తకు లభించిన పురస్కారం మాత్రమే కాదు.. అమెరికాలో భారతీయ ఆహార సంస్కృతికి పెరుగుతున్న ఆదరణకు కూడా ఒక గుర్తింపుగా చెప్పవచ్చు.