Operation Sindoor: యుద్ధంలో గెలుపు సాధించిన తర్వాత కూడా భారత్ అహంకారంతో వ్యవహరించడం లేదు. చిత్తుగా ఓడిన పాకిస్తాన్ మాత్రం తామే గెలిచామని ప్రచారం చేసుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో త్రివిధ దళాల అధిపతిగా ఉన్న జనరల్ అనిల్ చౌహాన్ ఇటీవల డిస్కవరీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గెలిచామన్న అహంకారం ఎక్కడా ప్రదర్శించలేదు. పాకిస్తాన్‌పై సాధించిన వ్యూహాత్మక ఆధిక్యాన్ని నిర్మొహమాటంగా వివరించారు. ఈ మాటలు కేవలం సైనిక విజయాన్ని కాకుండా, భారత పరిణతి చెందిన వ్యూహాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి.
పాక్ వ్యూహాలు విఫలం..
చౌహాన్ ప్రకారం, భారత్ వ్యూహం పాకిస్తాన్ కంటే చాలా బలంగా ఉంది. పాక్ సైన్యం భారత్ ప్రణాళికలను పసిగట్టడంలో, అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైంది. వారి దగ్గర ప్రొఫెషనలిజం కూడా కరువైందని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో అవాక్స్ వంటి రాడార్ వ్యవస్థలు, చైనా సరఫరా చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ఉన్నప్పటికీ, భారత్ వాటిని కన్నుగప్పి నేరుగా ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయగలిగింది. ఇది పాక్ నిఘా, రక్షణ వ్యవస్థల బలహీనతను బహిర్గతం చేసింది.
నాలుగు అంచెల ఎయిర్ డిఫెన్స్..
పాకిస్తాన్ ప్రతిస్పందనగా యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులు మొదలుపెట్టింది. కానీ భారత్ ఆకాశ్, ఎస్–400 వంటి నాలుగు అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరించి ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగంలోకి ప్రవేశించకుండా చేసింది. ఈ రక్షణ గోడ చూసి పాకిస్తాన్ బిత్తరపోయింది. వారు కోలుకునే లోపే భారత వైమానిక దళం పాక్ లోపలికి వెళ్లి ఎయిర్‌బేస్‌లపై కచ్చితమైన దాడులు చేసింది. ఇవి పాకిస్తాన్ ఊహించని ఎత్తుగడలు. ఒకవైపు రక్షణ, మరోవైపు దాడి ఈ ద్వంద్వ వ్యూహం పాక్‌ను పూర్తిగా అసమతుల్యం చేసింది.
బుద్ధి చెప్పే చర్యగా..
భారత్‌కు యుద్ధం చేయాలన్న కాంక్ష లేదని చౌహాన్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తమ దేశంలో ఉగ్రదాడి జరిగినందున బుద్ధి చెప్పడానికే ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు. పాకిస్తాన్ చివరకు అమెరికా, గల్ఫ్ దేశాలను శరణు కోరి యుద్ధం ఆపించాలని వేడుకుంది. భారత్ యూఏఈ, అమెరికాకు స్పష్టం చేసింది.. పాక్ డీజీఎంవో భారత్ డీజీఎంవోతో మాట్లాడాలి, అప్పుడే దాడులు ఆగుతాయి. ఇది కేవలం సైనిక విజయం కాదు, దౌత్యపరమైన, వ్యూహాత్మక ఆధిక్యం కూడా.
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సైనిక సామర్థ్యం, ప్రణాళికా నైపుణ్యం, సంయమనాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్ అంచనాలు తప్పిపోయాయి. వారి రక్షణ వ్యవస్థలు సరిపోలేదు. భారత్ మాత్రం అహంకారం లేకుండా, లక్ష్యబద్ధంగా వ్యవహరించింది. ఇది భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక నమూనాగా నిలుస్తుంది. విజయం సాధించిన తర్వాత కూడా ప్రశాంతంగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగడమే నిజమైన బలం అని ఈ ఆపరేషన్ నిరూపించింది.