ఆకాశంలో మబ్బు లేదు. కనీసం ఒక్క చినుకు కూడా కురవలేదు. అటువంటిచోట ఈ స్థాయిలో వరదలు ఎలా.. ఆకస్మికంగా ఈ జలప్రళయం ఎలా సంభవించింది.. ఈ స్థాయిలో నష్టానికి కారణం ఏమై ఉంటుంది.. ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
నేపాల్ దేశంలో సంభవించిన జలవిలయం సృష్టించిన నష్టం మామూలుగా లేదు. ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం వెరసి నేపాల్ దేశం సర్వనాశనమైంది. వాస్తవానికి నేపాల్ దేశంలో వరదలు రావడం.. వర్షాలు విస్తారంగా కురవడం కొత్తేమీ కాదు. గతంలో ఆ ప్రాంతంలో వర్షాలు కురిసినప్పుడు మాత్రమే వరదలు వచ్చేవి. కానీ ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. అయినప్పటికీ అక్కడ వరదలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ స్థాయిలో వరదలు రావడం వెనక అసలు కారణం వేరే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఎగువ ప్రాంతంలో భారీ మొత్తంలో మంచు ఒక్కసారిగా నదిలో కలవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేపాల్, డిబేట్ దేశాలతో సరిహద్దుల్లో ఉన్న బోటే కోసి నదికి త్రిశూల్, లెండే కోలా వంటి ఉపనదులు ఉన్నాయి. బుధవారం ఈ ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ నేపథ్యంలో గెలిచి అనే ప్రాంతానికి ఎగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 17వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక హిమ నదిలోకి దాదాపు 2 వేల అడుగుల విస్తీర్ణంలో ఉన్న మంచు ఫలకం వేరుపడింది. దీంతో కోలా నది లో ప్రవాహం పెరిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న మట్టి.. రాళ్లు భారీగా తోసుకొని వచ్చాయి. ఆ ప్రవాహం అత్యంత వేగంగా బోటే కోసి నదిలోకి వచ్చేసింది. ఫలితంగా జల విస్ఫోటనం జరిగింది. ఆ ప్రవాహం దూసుకు వచ్చి.. తనకు అడ్డుగా ఉన్న ప్రతి ఆ నిర్మాణాన్ని పడగొట్టుకుంటూ వచ్చింది.
ఈ ప్రమాదానికి కేవలం మంచు గడ్డ విరిగి పడటమే మాత్రమే కాకుండా.. కొండ చరియలు విరిగిపడడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదం వల్ల బోటే కోసి నది కేంద్రంగా ఏర్పాటు చేసిన 12 జల విద్యుత్ కేంద్రాలు.. వంతెనలు మొత్తం కూలిపోయాయి. ప్రవాహం తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే గల్చి వద్ద కేవలం 30 నిమిషాల్లోనే నదీ ప్రవాహం 30 అడుగులకు పెరిగింది అంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.