Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఏదో ఒక దానిపై ఆయన ట్రోల్స్ కు గురికావడం ఖాయం. నిన్ననే వారాంతపు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జగన్. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, బీసీ రిజర్వేషన్లు, ఇలా చాలా అంశాలపై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. చంద్రబాబు సర్కార్ అన్నింట వైఫల్యం చెందిందంటూ విమర్శించారు జగన్. అంతవరకు ఓకే కానీ ప్రెస్ మీట్ చివర్లో వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందట.. సర్వేల్లో ఇదే తేలుతుందట.. అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చంద్రబాబు ఇదే మాదిరిగా పాలిస్తే తనకు ఎవరు ఓట్లు వేస్తారు అంటూ తిరిగి జగన్ ప్రశ్నించారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* కూటమిపై విపరీతమైన వ్యతిరేకత..
కూటమి ప్రభుత్వంపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదట.. శాంతి భద్రతలు క్షీణించాయట.. అభివృద్ధి లేదట.. అవినీతి పెరిగిందట.. ఇలా ఈ అంశాల చుట్టూ జగన్ ప్రెస్ మీట్ కొనసాగుతూ వచ్చింది నిన్న. అయితే మొన్నటికి మొన్న ఓ ఊరు పేరు తెలియని సర్వే ఒకటి హల్చల్ చేసింది. అందులో కూటమి గ్రాఫ్ తగ్గి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందని తెలిసిందట. దానినే వైసీపీ సోషల్ మీడియా హైప్ చేసుకుంటుండగా.. దాని గురించి నిన్న ప్రెస్మీట్లో ప్రత్యేకంగా ప్రస్తావించేసరికి ఈ మాదిరిగా చంద్రబాబు పాలిస్తే ఓట్లు ఎందుకు వేస్తారు అంటూ ప్రశ్నించారు. అయితే నేరుగా సమాధానం చెప్పకుండా బాగా పాలిస్తున్నారు కాబట్టి.. చంద్రబాబుకే మళ్ళీ ప్రజలు ఓటు వేస్తారు అన్నట్టు మారింది జగన్ హావభావం.
* సర్వే సందడి..
ఇటీవల హడావిడి చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అనేటంత భ్రమల్లో ఉన్నారు ఆ పార్టీ శ్రేణులు. ఇక తిరుగులేదు కూటమి పని అయిపోయింది అంటూ తేల్చి చెబుతున్నారు. కానీ వాస్తవ పరిశీలకులతోపాటు.. కొన్ని వర్గాల వారు చెబుతున్న మాట ఏంటంటే.. కూటమి ప్రభుత్వంపై సాధారణ వ్యతిరేకత ఉంది. ఏ పార్టీ అధికారం చేపట్టిన అదే స్థాయిలో వ్యతిరేకత ఉంటుంది. కానీ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే కూటమి కంటే వైసీపీ పైనే ఎక్కువ వ్యతిరేకత అని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమికంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎక్కువగా పడిపోతుందని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే రాజకీయ పార్టీలు అన్నాక పెయిడ్ సర్వేలు సాధారణం. కానీ వాటినే పట్టుకుని రాజకీయ పార్టీలు ధీమాతో ఉంటే మాత్రం అసలుకే ఎసరు ఖాయం.