YSRCP: నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది అవుతుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా నోరు వేసుకొని వాగేస్తూ ఉంటే ఎవరూ లెక్కచేయరు. ఇప్పుడు వైసీపీ నాయకులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. పైగా అధికారం కోల్పోయామనే బాధ వారిలో నర నరం ఉంది. అందువల్లే ఈ ఫ్రస్టేషన్లో ఏం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో జరిగిన ఒక కార్యక్రమానికి రజనీకాంత్ హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన ఏదో మాట్లాడి వెళ్లిపోయారు. ఆ విషయాన్ని వైసిపి తనకు ఆపాదించుకుంది. ఇక రజనీకాంత్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టింది. కొడాలి నాని నుంచి మొదలు పెడితే రోజా వరకు రజనీకాంత్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఒక దశలో రజనీకాంత్ టిడిపికి అమ్ముడుపోయిన వ్యక్తి అని ఆరోపించారు. అయితే ఈ విమర్శలను నాడు టిడిపి గట్టిగానే తిప్పికొట్టింది.. ఇది 2024 ఎన్నికల్లో వైసీపీకి తీవ్రమైన డ్యామేజ్ చేసింది. వాస్తవానికి రజనీకాంత్ పై ఆస్థాయిలో వైసీపీ కోపం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రజినీకాంత్ వైసిపిని ఒక్క మాట కూడా అనలేదు. ఆయన ఏదో లోకోక్తి మాటలను చెప్పుకుంటూ వెళ్లిపోయారు. ఆ మాటలను వైసిపి తనకు ఆపాదించుకుంది.
ఇక ఇప్పుడు అనంత్ అంబానీ విషయంలో కూడా వైసిపి దారుణంగా వ్యవహరిస్తోంది. కొద్దిరోజులుగా రకరకాల సోషల్ మీడియా గ్రూపులలో అనంత్ అంబానీని బాడీ షేమింగ్ చేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల మదనపల్లిలో గ్లోబల్ హార్టికల్చర్ కేంద్రాన్ని రిలయన్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ హాజరయ్యారు. ఆ సమయంలో వేదిక మీద అనంత్ భావోద్వేగంగా మాట్లాడారు. ఇకపై తాను ఏపీ బిడ్డను అని వ్యాఖ్యానించారు. అంతకుముందు విమానాశ్రయంలో తన తండ్రి లాంటి నారా చంద్రబాబు నాయుడు పాదాలకు నమస్కరించారు. అంతటి ముఖేష్ అంబానీ కుమారుడు ఇలా నారా చంద్రబాబు నాయుడు పాదాల మీద పడటం వైసిపికి ఏమాత్రం నచ్చలేదు. పైగా రాయలసీమ అభివృద్ధికి లక్ష కోట్లు కేటాయించడంతో వైసిపి అగ్గిమీద గుగ్గిలమైంది. సొంత మీడియాలో తలా తోకాలేని కథనాలు ప్రసారం చేసింది. అక్కడితోనే ఆగలేదు. తమలో ఉన్న మరో కోణాన్ని బయటకి చూపించడం మొదలుపెట్టారు.
మదనపల్లిలో హార్టికల్చర్ కేంద్రానికి కేంద్ర బిందువైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అతడు లావుగా ఉంటాడు కాబట్టి.. మోటా ఆద్మీ అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఫ్యాబ్రికేటెడ్ వీడియోలతో గేలిచేయడం ప్రారంభించింది. వాస్తవానికి ఏ మనిషిలో అయినా సరే ఏదో ఒక లోపం ఉంటుంది. దానినే చూపిస్తూ ఎగతాళి చేయడం అత్యంత హీనం. ఈ విషయంలో దిగజారి పోరు అనుకున్న ప్రతి సందర్భంలో అంతకు మించిన స్థాయిలో దిగజారి పోతున్నారు వైసీపీ నాయకులు. పైగా విషపు రాజకీయాలలో తమకు తామే నెంబర్ వన్ అంటూ నిరూపించుకుంటున్నారు. మరి ఇటువంటి వ్యక్తులను మన చట్టాలు ఏమి చేయలేవా.. మన ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేవా.. సగటు ఏపీ ప్రజల్లో ఇవే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి వీటికి సమాధానం చెప్పాల్సింది ముమ్మాటికి ఏపీ ప్రభుత్వ పెద్దలే.