Vijay Deverakonda: సందీప్ రెడ్డి వంగ కి నేడు పాన్ ఇండియా లెవెల్ లో ఈ స్థాయి క్రేజ్ ఉందంటే, అందుకు ముఖ్య కారణం ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమాతోనే ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. విజయ్ దేవరకొండ కి ఇది రెండవ సినిమా. సందీప్ వంగ కి ఈ సినిమా ద్వారా ఎంతటి క్రేజ్ వచ్చిందో, విజయ్ దేవరకొండ కి కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ లో పట్టుమని రెండు సూపర్ హిట్ సినిమాలు కూడా లేవు. అయినప్పటికీ యూత్ ఆడియన్స్ లో ఇంత క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం అర్జున్ రెడ్డి. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తే అక్కడ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. అలా వీళ్లిద్దరి కెరీర్ ఈ సినిమాతో ఊహించని రీతిలో యూ టర్న్ తీసుకున్నాయి. ఇది ఇలా ఉండగా, సందీప్ వంగ నిర్మాతగా వ్యవహరించిన ‘రోమాంచకం’ అనే చిత్రం ఈ సెప్టెంబర్ 3 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయగా, విజయ్ దేవరకొండ ముఖ్య అతిథి గా విచ్చేసి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘సందీప్ పై నాకున్న ప్రేమని మాటల్లో చెప్పలేను, మా ఇద్దరి మధ్య స్నేహం కాదు, సోదర భావం ఉంది. ఒకే తల్లి కడుపునా పుట్టకపోయిన మేమిద్దరం బ్రదర్స్. అర్జున్ రెడ్డి మూవీ షూటింగ్ సమయం లో మేమిద్దరం కలిసి పడిన కష్టాన్ని జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేను. ఒక యుద్ధమే చేశాము. ఇంతకష్టపడి చేస్తున్నాము, పొరపాటున సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి అని భయపడేవాళ్ళం. వాటి గురించి ఆలోచిస్తేనే మెంటల్ వచ్చేసేది. ఆ సమయం లో చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు, నా మొదటి సినిమా పెళ్లి చూపులు కూడా విడుదల అవ్వలేదు, పెట్టుబడి పెట్టేవాళ్ళు లేదు, ఫ్యాన్ బేస్ బలం లేదు’.
‘కేవలం ధైర్యం మాత్రమే మా వద్ద ఉన్నది. అలా ధైర్యంగా అడుగు ముందుకు వేశాము. సినిమా ఊహించని రీతిలో బంపర్ హిట్ అయ్యింది. పెట్టుబడి పెట్టేవాళ్ళు లేకపోతే సందీప్ అన్న ప్రణయ్, వాళ్ళతో నాన్నతో పొలం అమ్మించి , నా మీద , సందీప్ మీద ప్రేమతో అర్జున్ రెడ్డి ని పూర్తి చేశారు. నా కోసం అంతటి రిస్క్ చేసిన సందీప్ కోసం ఎంత దూరమైనా వెళ్తా, నేను పిలిస్తే సందీప్ ఎక్కడికైనా వస్తాడు, అలాంటి సందీప్ పిలిచాక కూడా ఈ ఈవెంట్ కి రాకపోతే నేను బ్రతికి వేస్ట్’ అంటూ విజయ్ దేవరకొండ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.