Tollywood Box Office Scam : సినిమాకి బ్లాక్‌బస్టర్ టాక్ వస్తుంది.. జనం కూడా థియేటర్లకు బాగానే వస్తున్నారని టాక్ నడుస్తుంది.. కానీ కట్ చేస్తే ప్రొడ్యూసర్ చేతికి వచ్చేసరికి వసూళ్లు సున్నా! హిట్ సినిమా అని సంబరపడాలో.. బాక్సాఫీస్ వద్ద నష్టాలు చూసి ఏడవాలో అర్థంకాని పరిస్థితి. అసలు టాలీవుడ్‌కి ఏమైంది? పెద్ద సినిమాలు కూడా థియేటర్లలో ఎందుకు దారుణంగా దెబ్బతింటున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ఒక సంచలన వాస్తవం ఇప్పుడు బయటపడింది!
గ్రౌండ్ రియాలిటీ
ఇది రాయలసీమలోని ఒక చిన్న పట్టణంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఒకప్పుడు ఆ ఊరిలో పది సినిమా థియేటర్లు కలకలలాడేవి. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి.. ఇప్పుడు కేవలం మూడు థియేటర్లు మాత్రమే మిగిలాయి. అందులో ఒక థియేటర్‌ను టాలీవుడ్‌లోని ఒక అగ్ర నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ లీజుకు తీసుకుని నడుపుతోంది. ఇటీవల మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఇరుముడి’ సినిమా అక్కడ ప్రదర్శించబడింది. జనాలు కూడా థియేటర్‌కి వచ్చి సినిమా బాగానే చూశారు. సరే, అసలు మ్యాటర్ ఇక్కడే మొదలైంది!
టికెట్ కౌంటర్ వద్ద ‘ట్విస్ట్’
ఈ నెల 18న ఆ సినిమా ఓటీటీలోకి వస్తోంది. అంటే కేవలం రెండ్రోజుల ముందు.. 16వ తేదీ సాయంత్రం ఫస్ట్ షో! సాధారణంగా ఓటీటీలో వచ్చేస్తుందిలే అని జనాలు థియేటర్‌కి రావడం తగ్గిస్తారు. కానీ ఆ రోజు ఫస్ట్ షోకి 100 మందికి పైగా ప్రేక్షకులు వచ్చారు.. అందులో మహిళలే ఎక్కువ! కానీ అక్కడ ఒక వింత జరిగింది! వచ్చిన జనం 100 మంది అయితే.. కౌంటర్‌లో తెగిన టికెట్లు మాత్రం కేవలం 50 మాత్రమే!
అవును, మీరు విన్నది నిజమే! డబ్బులు నగదు రూపంలో ఇచ్చినా.. లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో పే చేసినా.. సగం మందికి టికెట్ ఇవ్వలేదు.. “డబ్బులొచ్చాయి.. సీటు నెంబర్ ఇది.. వెళ్లి కూర్చోండి” అని లోపలికి పంపించేశారు. అమాయక జనం కూడా టికెట్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని వెళ్లి సినిమా చూసేశారు.
అసలు మోసం ఎక్కడ జరుగుతోంది?
ఇప్పుడు అసలైన ప్రశ్నేంటంటే.. ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి? టికెట్ కౌంటర్‌లో ఉండే వ్యక్తి, గేటు దగ్గర నిలబడే వ్యక్తి కలిసి ఈ సొమ్మును కాజేస్తున్నారా? థియేటర్‌ను లీజుకు తీసుకున్న ఆ పెద్ద సంస్థను మోసం చేస్తున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చిన్నదేమీ కాదు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న అగ్ర సంస్థ.. పైగా లెక్కల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటుంది. సిబ్బందిపై వేయి కళ్లు వేసి నిఘా ఉంచగల వ్యవస్థ వారికుంది. అలాంటప్పుడు చిన్న ఉద్యోగులు సంస్థను మోసం చేయడం సాధ్యమయ్యే పనేనా?
అంటే.. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? టికెట్లు అమ్ముడవుతున్నా.. ఆ కాసుల లెక్కలను మాత్రం అధికారికంగా చూపించకుండా థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కలిసి అసలు నిర్మాతను మోసం చేస్తున్నాయా? మైత్రి మూవీ మేకర్స్ వంటి దిగ్గజ నిర్మాణ సంస్థలకే ఇలాంటి దెబ్బలు తగులుతుంటే.. ఇక వీళ్లను నమ్మి చిన్న నిర్మాతలు తమ సినిమాలను డిస్ట్రిబ్యూషన్‌కు ఇస్తే ఏమవ్వాలి? సాంతం దివాలా తీయడం తప్ప వేరే దారి ఉందా? బాక్సాఫీస్ వద్ద ‘హిట్’ అని బోర్డులు కనిపిస్తున్నా, కలెక్షన్ల గల్లాపెట్టె ఖాళీగా ఉండటానికి ఇదొక ప్రధాన కారణం కాదా?
ఇలాంటి అక్రమాలు జరుగుతున్నంత కాలం.. థియేట్రికల్ రిలీజ్ అనేది నిర్మాతలకు ఒక పెద్ద జూదంగానే మిగిలిపోతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? థియేటర్లలో జరుగుతున్న ఈ టికెట్ గోల్‌మాల్‌పై మీ అనుభవాలను కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి.