Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కరీంనగర్‌కు చెందిన షాలినీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. తన జీవితంలో ఒకే ఒక్క లవ్ స్టోరీ ఉందని, అది దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిందని ఆమె వెల్లడించింది. అయితే కుటుంబ పరిస్థితులు, బాధ్యతల కారణంగా ఆ ప్రేమ చివరకు బ్రేకప్‌గా మారిందని షాలినీ చెప్పుకొచ్చింది.
తనకు ఒకరిని ప్రేమించడం, నమ్మడం అంత సులభం కాదని షాలినీ తెలిపింది. ‘‘నా జీవితంలో ఒక్కటే లవ్ స్టోరీ ఉండేది. అది ఆరు సంవత్సరాల ప్రేమ. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ రిలేషన్‌షిప్. ఆ తర్వాత ఎవరినైనా నమ్మాలంటే భయంగా ఉంది. ఎవరినీ పూర్తిగా నమ్మలేకపోతున్నా’’ అని తన గత ప్రేమను గుర్తు చేసుకుంది.
దాండియా సమయంలో పరిచయం..
తన మాజీ ప్రియుడితో పరిచయం ఎలా ఏర్పడిందో కూడా షాలినీ వివరించింది. ఒక పండుగ సందర్భంగా దాండియా ఆడుతున్న సమయంలో అతడితో పరిచయం ఏర్పడిందట. దాండియా తనకు తెలియడంతో అతడికి తానే నేర్పించానని చెప్పింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారిందని తెలిపింది.
దాండియా తర్వాత ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైందని, కొంతకాలానికి అతడే తనకు ప్రపోజ్ చేశాడని షాలినీ చెప్పింది. అతడి ప్రపోజల్‌ను తాను అంగీకరించానని వెల్లడించింది. తాను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే ఈ ప్రేమ మొదలైందని పేర్కొంది.
ఆస్ట్రేలియా వెళ్లాలని ప్రియుడి ఒత్తిడి..
అయితే డిగ్రీ పూర్తయిన తర్వాత షాలినీకి ఉద్యోగం వచ్చింది. మరోవైపు ఆమె ప్రియుడికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం లభించింది. దీంతో షాలినీ కూడా ఉద్యోగం మానేసి తనతో కలిసి ఆస్ట్రేలియా రావాలని అతడు కోరాడట. అయితే అదే సమయంలో షాలినీ కుటుంబ పరిస్థితులు వారి ప్రేమకు అడ్డంకిగా మారాయి.
తన కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉందని షాలినీ తెలిపింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో తల్లి ఒక్కరే తనను పెంచిందని చెప్పింది. విదేశాలకు వెళ్లే స్థోమత తమ కుటుంబానికి లేదని వివరించింది. తల్లిని ఒంటరిగా వదిలి ఆస్ట్రేలియా వెళ్లడం తనకు ఇష్టం లేదని, ఉద్యోగం చేస్తూ తల్లితోనే ఉంటానని ప్రియుడికి చెప్పినట్లు వెల్లడించింది.
అయితే ఇద్దరి జీవితాలపై ఉన్న భిన్నమైన బాధ్యతలు, భవిష్యత్తుపై వచ్చిన విభేదాల కారణంగా చివరకు తమ ఆరేళ్ల ప్రేమకు ముగింపు పలకాల్సి వచ్చిందని షాలినీ చెప్పింది. బిగ్ బాస్ హౌస్‌లో ఆమె వెల్లడించిన ఈ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.