Women Safety : మహిళల భద్రత అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అత్యాచారాలు, వేధింపులు, దాడులు, హత్యలు.. కానీ అంతకంటే ముందే మహిళలను మానసికంగా వేధిస్తున్న మరో సమస్య ఉంది. అదే పురుషుల వంకర చూపులు! నోటి నుంచి ఒక్క మాట రాకపోయినా.. కళ్లతోనే కామెంట్లు చేసే కొందరు మహానుభావుల తీరు మహిళలకు నిత్య నరకం చూపిస్తోంది. రోడ్డుపై నడిచినా, బస్సు ఎక్కినా, మెట్రో స్టేషన్‌కు వెళ్లినా వారి చూపుల నుంచి తప్పించుకోవడం కష్టంగా మారుతోందట. తాజాగా ఓ అధ్యయనం వెల్లడించిన గణాంకాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై నిర్వహించిన ఓ అధ్యయనం ఆందోళనకర విషయాలను బయటపెట్టింది. మొత్తం 1,588 మంది మహిళలు, బాలికలు, LGBTQ వర్గాలకు చెందిన వ్యక్తుల అభిప్రాయాలను సేకరించగా.. దాదాపు 80 శాతం మంది పురుషుల చూపులు, అసభ్య వ్యాఖ్యల కారణంగా ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. అంటే మహిళలను ఇబ్బంది పెట్టడానికి కొందరికి మాటలు కూడా అవసరం లేదన్నమాట. చూపులతోనే తమ వికృత మనస్తత్వాన్ని బయటపెడుతున్నారన్నది ఈ ఫిర్యాదుల సారాంశం.
ఇక ఢిల్లీలో ప్రతి పది మంది మహిళల్లో తొమ్మిది మంది తమ భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా 87.5 శాతం మంది మెట్రో స్టేషన్లు, బస్ స్టాపులకు వెళ్లే మార్గాల్లో అభద్రతను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అంటే గమ్యస్థానానికి చేరుకోవడానికి ముందే భయంతో సగం ప్రయాణం అయిపోతోందన్నమాట. ఇక 88.9 శాతం మంది చీకటి పడిన తర్వాత పార్కులు సురక్షితంగా ఉండవని అభిప్రాయపడ్డారు.
మహిళల కోసం ప్రత్యేకంగా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, పోలీసు పెట్రోలింగ్ పెంచుతున్నామని, హెల్ప్‌లైన్లు అందుబాటులో ఉన్నాయని ప్రకటిస్తున్నాయి. కానీ మహిళల అనుభవాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి. కెమెరాలు రోడ్లపై ఉన్నా.. కొందరి చూపుల్లోని వికృతిని ఎలా గుర్తిస్తాయి? పోలీసు పెట్రోలింగ్ ఉన్నా.. పక్కనే నిలబడి అసభ్యంగా చూసే వ్యక్తిని ప్రతిసారీ ఎలా పట్టుకుంటారు?
మహిళల స్వేచ్ఛ అంటే ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడం మాత్రమే కాదు. ఎలాంటి భయం లేకుండా రోడ్డుపై నడిచే హక్కు కల్పించడం కూడా. మహిళ కనిపిస్తే చాలు కళ్లు పెద్దవి చేసి చూడటం, వెంబడించడం, అసభ్య వ్యాఖ్యలు చేయడం మగతనం కాదు.. అది సభ్యత లేని ప్రవర్తనకు నిదర్శనం.
మొత్తానికి మహిళల భద్రతపై చర్చలు సభల్లో, సమావేశాల్లో సాగుతున్నా.. రోడ్లపై మాత్రం పరిస్థితి మారడం లేదు. మహిళలు ఎక్కడికి వెళ్లినా తమ చూపులను అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదని కొందరు పురుషులు అనుకుంటున్నారేమో! కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.. మహిళలపై చూపులు విసరడం సరదా కావచ్చు.. వాటిని భరించే మహిళలకు మాత్రం అది రోజువారీ మానసిక వేధింపే. సమాజం మారాలంటే ముందుగా చూపులు మారాలి.. ఆలోచనలు మారాలి!