Rain Prayer: ఎల్ నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు ఇప్పటికీ సరైన వర్షాలు లేవు. ఈ నేపథ్యంలో వరుణుడి కరుణ కోసం చాలా ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో వర్షాల కోసం పూజలు చేస్తుండగా.. ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటతో అక్కడున్న వారంతా సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ గ్రామస్తులు వర్షాల కోసం ఏం చేశారు?
ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కానీ అనేక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో సాగు పనులు ఆలస్యమవడంతో పాటు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాల్లో చెరువులు, కుంటలు పూర్తిగా నిండకపోవడంతో నీటి కొరత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో వర్షాలు కురవాలని గ్రామస్థులు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని నిర్ణయించారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని అడవి బూదుగూరు గ్రామంలోఅడవి బూదుగూరు గ్రామానికి చెందిన మహిళలు, పురుషులు, చిన్నారులు, వృద్ధులు ఇలా గ్రామస్థులందరూ కలిసి గ్రామ చెరువులో సంప్రదాయబద్ధంగా వానదేవర పూజలు నిర్వహించారు. గ్రామ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, మంచి వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశారు. గ్రామంలో పంటలు బాగా పండాలని, చెరువులు నిండాలని కోరుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
పూజలు కొనసాగుతుండగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది. బలమైన ఈదురుగాలులు వీయడం ప్రారంభమై, కొద్ది సేపటికే మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. ఎండలతో ఇబ్బంది పడుతున్న గ్రామస్థులకు ఈ వర్షం ఊహించని ఆనందాన్ని తీసుకొచ్చింది. వర్షం ప్రారంభమైన వెంటనే గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వర్షంలో తడుస్తూ కేరింతలు కొట్టారు. పిల్లలు వర్షంలో ఆడుకుంటుండగా, పెద్దలు కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ వర్షాన్ని స్వాగతించారు. చాలా రోజుల తర్వాత కురిసిన వర్షాన్ని గ్రామస్థులు ప్రకృతి వరంగా భావించారు.