Cherrapunji Rainfall: భారతదేశంపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా చూపుతున్నట్లు ఇప్పటికే అర్థమైంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన వర్షాలు లేవు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వరదలతో ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. అయితే ఎల్ నినో ప్రభావం ఇప్పుడు చిరపుంజీపై కూడా పడిందని తెలుస్తోంది. దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రంగా పేరుగాంచిన మేఘాలయ లోని చిరపుంజిలో కూడా వర్షాలు తగ్గాయి. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలుగా మౌసిన్‌రామ్, చిరపుంజీ ప్రాంతాలను పేర్కొంటారు. ఎందుకంటే ఇక్కడ ఏడాది పొడవునా వర్షాలు కురుస్తుంటాయి. కానీ ఈ ఏడాది ఈ ప్రాంతాల్లో జులై నెలలో కురవాల్సిన వర్షాల్లో సుమారు 50 శాతం మాత్రమే నమోదైంది. సాధారణంగా జులైలో 2,786 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుండగా, ఈసారి కేవలం 1,403 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో వాతావరణ నిపుణులు దీనిని అసాధారణ పరిస్థితిగా అభివర్ణిస్తున్నారు.
ఫసిపిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితినే ఎల్‌నినో అంటారు. దీని ప్రభావంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడం, మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం కనిపిస్తోంది. భారతదేశ నైరుతి రుతుపవనాలపై కూడా ఎల్‌నినో ప్రభావం పడుతుండటంతో ఈసారి మేఘాలయలో సాధారణ స్థాయిలో వర్షాలు కురవలేదని నిపుణులు చెబుతున్నారు.
మౌసిన్‌రామ్ ప్రపంచంలోనే అత్యధిక సగటు వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఏడాదికి సగటున 11,872 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అదే జిల్లాలోని చిరపుంజీలో సగటు వార్షిక వర్షపాతం 11,777 మిల్లీమీటర్లు. ఈ రెండు ప్రాంతాలు దశాబ్దాలుగా అత్యధిక వర్షపాతం రికార్డులను తమ పేరుమీద నమోదు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి.
వర్షాలు తగ్గిపోవడం వల్ల స్థానిక నదులు, జలపాతాలు, భూగర్భ జలాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయం, తాగునీటి వనరులు, పర్యాటక రంగం కూడా ఈ పరిస్థితి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాలపై ఆధారపడే పంటలు సాగు చేసే రైతులకు ఇది సవాల్‌గా మారవచ్చని భావిస్తున్నారు.
మేఘాలయ వంటి అత్యధిక వర్షపాతం ప్రాంతంలో కూడా వర్షాలు గణనీయంగా తగ్గిపోవడం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులకు మరో ఉదాహరణగా నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో వాతావరణ మార్పులను తగ్గించే చర్యలు, సహజ వనరుల సంరక్షణ, నీటి నిర్వహణపై ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.