Shubhman Gill: ఆటగాడిగా అదరగొడుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు. కొన్ని సందర్భాలలో డబుల్ సెంచరీ కూడా చేస్తున్నాడు. కొండంత లక్ష్యం ఎదురుగా ఉన్నప్పుడు ఏమాత్రం భయం అనేది లేకుండా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా టీమిండియాకు సరైన ఆటగాడు వచ్చాడని విశ్లేషకులు అంటున్నారు. ఇది టీమిండియా కెప్టెన్ గిల్ లో పాజిటివ్ కోణం. ఇంకో కోణం మాత్రం ఇబ్బంది పెడుతోంది.
గిల్ నాయకత్వంలో టీమిండియా 15 మ్యాచ్లు ఆడింది. మొత్తంగా 8 విజయాలు సాధించింది. ఏడు ఓటములు ఎదుర్కొంది. ఆటగాడిగా గిల్ అదరగొడుతున్నాడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. పైగా ఎటువంటి స్థానంలో వచ్చినా సరే అతడు బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎప్పుడో ఒకసారి మినహాయిస్తే.. మిగతా అన్ని సందర్భాలలో తన స్టామినాను మరింత బలంగా నిరూపించుకుంటున్నాడు. అయితే గిల్ నాయకత్వంలో టీమిండియా 8 విజయాలు, ఏడు ఓటములు.. సాధించడంతో విశ్లేషకులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇటువంటి ఆటగాడికి వన్డే వరల్డ్ కప్ లో సారధిగా ఎలా అవకాశం కల్పిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు..
గిల్ కెప్టెన్ అయిన తర్వాత టీమిండియా ఆరు మ్యాచ్లలో ముందుగా బ్యాటింగ్ చేసింది. ఐదుసార్లు ఓటమిపాలైంది. ఇలా ఓడిపోవడం గిల్ నాయకత్వం ఎదుట సరికొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లను గిల్ సమర్థవంతంగా వేయించలేకపోతున్నాడు. బౌలర్ల కూర్పు విషయంలో విఫలమవుతున్నాడు. అందువల్ల టీం ఇండియా ఓటమిపాలవుతుంది. ముఖ్యంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన చివరి వన్డేలో గిల్ సరైన స్థాయిలో ఆడలేకపోయాడు. బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. ఆ తర్వాత డెత్ ఓవర్లలో సమర్థులైన బౌలర్లతో బౌలింగ్ వేయించలేకపోయాడు. 40 ఓవర్ల దాకా టీమిండియా మ్యాచ్ మీద పట్టు కలిగి ఉంది. కానీ వెస్టిండీస్ కెప్టెన్ హోప్ ను వెనక్కి పంపడంలో గిల్ విజయవంతంగా లేకపోయాడు. ఆటగాళ్ల మార్పు.. కూర్పు విషయంలో సరైన విధానాలను పాటించలేకపోయాడు. అందువల్లే టీమిండియా ఓటమిపాలైంది.
దక్షిణాఫ్రికా మైదానాలు చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తున్న గిల్ అనేక ప్రయోగాలను అక్కడ చేపట్టాల్సి ఉంటుంది. ఉన్న ఆటగాళ్లతోనే మెరుగైన ప్రదర్శన చేయించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు గిల్ తన లోపాలను సరిదిద్దుకోవాలి. తన నాయకత్వ పటిమను మరింత పెంచుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. టీమ్ ఇండియా సిరీస్ గెలిచినప్పటికీ.. చివరి వన్డేలో ఓడిపోవడం అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు. అందువల్లే గిల్ నాయకత్వ తీరును విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ గెలవాల్సిన బాధ్యత టీమిండియా మీద ఉంది. అలాంటప్పుడు అతడు జట్టును ఏ విధంగా ముందుకు నడిపిస్తాడు.. మేనేజ్మెంట్ అతడి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. టీమిండియా వరల్డ్ కప్ గెలవడం అత్యంత అవశ్యం కాబట్టి గిల్ కు ఉద్వాసన పలికినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని విశ్లేషకులు అంటున్నారు.