Singitam Srinivasa Rao:తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. వైవిధ్యమైన కథలకు ఆయన చిరునామా. కొత్త ఆలోచనలకు ఆయన ఒక భాండాగారం. ఎన్నో సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రతి సినిమాలో తన ముద్ర ఉండేలా చూసుకున్నారు. వైవిధ్యమైన కథను.. భిన్నమైన స్క్రీన్ ప్లే తో రూపొందించడం.. అదే స్థాయిలో నటుల నుంచి నటన రాబట్టుకోవడం.. తద్వారా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. దాదాపు అయిదు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమతో సంబంధం కొనసాగిస్తున్న ఆయన.. ఇక శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు.
తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు.. విలక్షణమైన సినిమాలకు చిరునామాగా ఉన్న సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. చెన్నైలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతంలో ఆయన జన్మించారు. కేవలం దర్శకుడుగా మాత్రమే కాకుండా.. రచయితగా.. నటుడిగా.. నిర్మాతగా.. సంగీత దర్శకుడిగా పని చేశారు. ఏకంగా ఐదు దశాబ్దాలకు పైగా తన కెరియర్ సినిమా రంగంలో కొనసాగించారు.
మొదట్లో సింగీతం శ్రీనివాసరావు దిగ్గజ దర్శకుడు కె.వి.రెడ్డి దగ్గర శిష్యరికం చేశారు. అందువల్లే ఆయన సినిమాల్లో కె.వి.రెడ్డి ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. కె.వి రెడ్డి దగ్గర కథ, స్క్రీన్ ప్లే, సాంకేతికత, సినిమా నిర్మాణం గురించి తెలుసుకున్నారు. ఆ అనుభవం తర్వాత ఆయన స్వతంత్ర దర్శకుడిగా తనదైన శైలిని ఏర్పరచుకున్నారు.
సొమ్మొకడిది సోకు ఒకడిది
1977లో పంతులమ్మ సినిమా ద్వారా శ్రీనివాసరావు దర్శక ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత సొమ్ము ఒకడిది సోకు ఒకడిది.. అమావాస్య చంద్రుడు.. రాజు రాణి జాకీ…. వసంతగీతం.. సంగీత సామ్రాట్ వంటి చిత్రాలతో ఆయన ప్రేక్షకుల హృదయాలలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం ఒకే తరహా సినిమాలకు ఆయన పరిమితం కాలేదు. ప్రతి చిత్రాన్ని కొత్తగా రూపొందించారు. ప్రతి సినిమాలను కొత్త కథను తీసుకొచ్చారు.
మయూరి సినిమా ద్వారా
మయూరి సినిమా శ్రీనివాసరావు కెరియర్లో ఒక ప్రత్యేకమైన చిత్రం. 1985లో ఈ సినిమా వచ్చింది. ప్రమాదంలో కాలు కోల్పోయిన నర్తకి సుధా చంద్రన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను ఆయన రూపొందించారు. బయోపిక్ కోసం ఆ పాత్రకు సరిపోయే నటిని వెతకడం మాత్రమే కాకుండా.. నిజ జీవితంలో ఆ అనుభవాన్ని ఎదుర్కొన్న సుధాచంద్రన్ నే ప్రధాన పాత్రలో నటింపజేయడం అప్పట్లో ఒక సంచలన నిర్ణయం. తన విలక్షణమైన ఆలోచన విధానానికి అప్పుడే ఆయన శంకుస్థాపన చేశారు.
పుష్పక విమానం సినిమా తో..
శ్రీనివాసరావు కెరియర్లో అత్యంత ప్రయోగాత్మకమైన చిత్రాల్లో పుష్పక విమానం ఒకటి. ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించారు. సినిమా పూర్తిగా సంభాషణ లేకుండా సాగుతూ ఉంటుంది. కేవలం హావభావాలు.. దృశ్య కథనం.. నేపద్య సంగీతం.. శబ్ద రూపకల్పనతోనే కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. 1987లో ఈ సినిమా విడుదలైంది. జాతీయస్థాయిలో ఉత్తమ ఆదరణ పొందిన చిత్రంగా గుర్తింపు సాధించింది.
బాలల కోసం
శ్రీనివాసరావు చిన్నాన్న కోసం కూడా గుర్తుండిపోయే సినిమాలు తీశారు. ఆదిత్య 369 అనే సినిమా ఆయన సృజనాత్మకతకు ఒక గొప్ప ఉదాహరణ. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో విజ్ఞానం.. వినోదం.. చరిత్ర.. కల్పన వంటి విషయాలను సమన్వయం చేశారు. సైన్స్ ఫిక్షన్ విభాగంలో ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త దారిని చూపించింది. అలాగే భైరవద్వీపం ద్వారా ఒక జానపద కథను అద్భుతమైన దృశకల్పనతో తెరమీదకి తీసుకొచ్చారు. మైకేల్ మదన కామరాజు, అపూర్వ సహోదరులు, చిన్న వదిన, ఆదిత్య 369, భైరవద్వీపం వంటి చిత్రాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు మైలురాళ్లు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా కన్నడ, హిందీ, తమిళ చిత్ర భాషల్లో కూడా ఆయన పనిచేశారు.
శ్రీనివాసరావుకు ఎన్నో పురస్కారాలు వచ్చాయి. మయూరి.. పుష్పక విమానం.. భైరవద్వీపం వంటి చిత్రాలు ఆయనకు ఎనలేని కీర్తిని అందించిపెట్టాయి. జాతీయస్థాయిలో చలనచిత్ర పురస్కారాలు.. నంది అవార్డులు.. ఫిల్మ్ ఫేర్ వంటి గౌరవాలు లభించాయి. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం వచ్చింది..
ఇటీవల కాలంలో ఆయన సింగ్ గీతం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. కేవలం పాటల ద్వారా మాత్రమే ఈ సినిమా సాగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక విభిన్నమైన సినిమాగా ఇది నిలిచిపోయింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. ఒక సమస్యను.. అది కూడా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందిని కేవలం పాటల ద్వారా కూడా చెప్పవచ్చని శ్రీనివాసరావు నిరూపించారు. అంతేకాదు చరమాంకంలో కూడా ఒక సినిమాకు దర్శకత్వం వహించి.. ప్రపంచ చిత్ర పరిశ్రమకే సవాల్ విసిరారు.