Kavitha:రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలో కొంగర కురుదు ఏ గ్రామంలో భూ వివాదం చోటు చేసుకుంది. ఇది కాస్త రాజకీయరణరంగంలా మారిపోయింది. గులాబీ పార్టీ కీలక నేతల ప్రమేయంతో నాడు ఈ భూముల్లో లే అవుట్లు వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సంబంధిత రైతులతో కలిసి తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత విలేకరుల సమావేశం నిర్వహించారు. సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంలో మీడియా సంస్థల మీద కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు.
ముందుగా సాక్షి.. ఆ తర్వాత నమస్తే తెలంగాణ
ఇక్కడి భూముల వ్యవహారంపై ముందుగా సాక్షి.. ఆ తర్వాత నమస్తే తెలంగాణలో కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని కవిత ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే మరుసటి రోజు ఈ కథనం మీద నమస్తే తెలంగాణ మౌనం పాటించింది. సాక్షి మాత్రం బాధిత రైతులకు అనుకూలంగా కాకుండా.. వ్యతిరేకంగా కథలను ప్రచురించింది. దీంతో ఈ రెండు మీడియా సంస్థల మధ్య అవగాహన ఉన్నట్టుగా కవిత అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రామన్న.. జగనన్న.. కొత్తగా స్నేహితులయ్యారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీసాయి. కేటీఆర్.. జగన్ మధ్య చాలా కాలంగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో గులాబీ పార్టీ జగన్ కు సహకరించినట్టు అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి.
అధికారుల అండదండలతో
కలెక్టరేట్ కు అత్యంత దగ్గరగా ఉన్న ఈ భూములు విలువైనవి.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా ఈ ప్రాంతం ఉంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారుల అండదండలతో ఈ భూములను సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. స్థానికంగా ఉన్న రైతులు ఇక్కడ సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూములకు నకిలీ రికార్డులు సృష్టించారు. వారి హక్కులను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పేద రైతుల భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఈ వ్యవహారంలో చూసి చూడనట్టు ఉండడం పట్ల కవిత మండిపడ్డారు.
రెవెన్యూ యంత్రాంగం విఫలం
1954 -55 ఖాస్రా పహాణి రికార్డుల ప్రకారం పేదలకు సంబంధించిన పట్టా, ఇనామ్, జాగిద్దారి భూములను పరిరక్షించడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైంది. ఈ భూముల్లో కొంత భాగం నిషేధిత జాబితా.. వక్ఫ్ ఆస్తుల పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ.. వాటికి నకిలీ ఆక్యుపేన్సీ రైట్ సర్టిఫికెట్లు సృష్టించారు. కోట్ల రూపాయల విలువైన బూదండకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలైన రైతుల పట్టా భూములను కూడా ఫోర్జరీ పత్రాలతో ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన బద్ద ఉన్నాయని కవిత బయటపెట్టారు.
హైకోర్టు స్టే ఉత్తర్వులు
ఇక్కడ భూములకు సంబంధించి హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్లు.. లే అవుట్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారని కవిత ప్రస్తావించారు. కలెక్టరేట్ ఎదుట 100 అడుగుల రోడ్డు కోసం ఈ భూమిని కేటాయించినట్టు చెబుతున్న సర్వే నెంబర్ 85 లోని ప్రభుత్వ భూమికి కూడా నకిలీ ఓఆర్సీ ద్వారా ప్రైవేట్ వెంచర్ లో కలిపే ప్రయత్నం జరిగిందని కవిత సంచలన నిజాలను బయటపెట్టారు. ఈ స్థాయిలో భూ దందా జరుగుతుంటే అధికారులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని కవిత ప్రశ్నించారు.
ఈ భూమి వివాదంలో కబ్జాకు పాల్పడింది ఎవరో తనకు తెలుసని కవిత చెప్పడం సంచలనంగా మారింది. ఆ వ్యక్తుల పేర్లను బయట పెట్టడం తన ఉద్దేశం కాదని.. బాధిత రైతులకు న్యాయం జరగడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించిన ఆమె.. ఈ వివాదంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంపై అధికారికంగా ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.
అయితే ఈ భూ వివాదం ఇప్పుడు కేవలం రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య మాత్రమే కాకుండా.. రాజకీయంగా.. మీడియా పరమైన కోణాలను కూడా సంతరించుకోవడం విశేషం. భూములకు సంబంధించిన నకిలీ పత్రాలు.. ఓ ఆర్సీలు.. రిజిస్ట్రేషన్ లపై ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై వివిధ మీడియా సంస్థలు వ్యవహరించిన తీరు కూడా ఆందోళన కలిగిస్తుంది.. అయితే కల్వకుంట్ల కవిత చేసిన భూకబ్జా.. నకిలీ పత్రాలు.. అధికారుల ప్రమేయం.. మీడియా సంస్థల మధ్య పరస్పర అవగాహన వంటి ఆరోపణలు రాజకీయంగా సంచలనం కలిగిస్తున్నప్పటికీ.. వారు అధికారికంగా స్పందిస్తే ఈ విషయంలో ఏం జరిగిందనే తేలుతుంది.