YS Jagan: లిక్కర్ కుంభకోణం జరిగింది. భూ పట్టాల కుంభకోణం జరిగింది.. ఇంకా అనేక వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. ఇందులో దర్యాప్తు బృందం అడుగుపెట్టింది. విచారణ సాగిస్తోంది. కేవలం ఏపీ రాష్ట్రానికి సంబంధించిన దర్యాప్తు బృందమే కాకుండా.. కేంద్ర దర్యాప్తు బృందాలు కూడా ఇందులోకి ప్రవేశించాయి.
లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే పెద్ద తలకాయలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో చాలామంది విచారణ ఖైదీలు ఉన్నారు. కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. అయినప్పటికీ లిక్కర్ కుంభకోణాన్ని దర్యాప్తు సంస్థలు తవ్వుతూనే ఉన్నాయి. తాజాగా అంబటి రాంబాబుకు నోటీసులు అందాయి. ఈ ప్రకారం చూసుకుంటే ఆయనను విచారించడం ఖాయం. పైకి ఆయన మేకపోతు గాంభీర్యం లాంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా లేదు. ఈ ప్రకారం చూసుకుంటే ఆయన అరెస్టు కూడా జరుగుతుందని చర్చ నడుస్తోంది.
లిక్కర్ స్కాం లో జగన్ మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్న ఒక వ్యక్తిని ఇటీవల ఈడి అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా మరిన్ని విషయాలను తెలుసుకున్నట్టు సమాచారం. జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే.. ఆ తదుపరి టార్గెట్ వైసిపి అధినేతనేనా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి లిక్కర్ స్కామ్ లో ఇష్టానుసారంగా నిబంధనలు మార్చారని.. అడ్డగోలుగా వ్యవహరించారని.. ఊరు పేరు లేని కంపెనీలకు లైసెన్సులు ఇచ్చారని.. ప్రజల రక్త మాంసాల మీద వ్యాపారం చేశారని ఇప్పటికే అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారుల వద్ద పకడ్బందీ ఆధారాలు ఉన్న నేపథ్యంలో.. జగన్ అరెస్టు ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీ రాజకీయాలు ప్రజల్లో మైలేజ్ రావాలంటే నాయకుల మీద కేసులు నమోదు కావాలి. వాళ్లు జైలుకు వెళ్లాలి అన్నట్టుగా మారిపోయింది. ఒకవేళ అదే గనుక మళ్లీ కార్యరూపం దాల్చితే కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది. అందువల్లే జగన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో జగన్ జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు కూడా ఆయన పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను గనుక జైల్లో వేస్తే అప్పుడు ప్రజల నుంచి సింపతి వస్తుందని.. ఆ తర్వాత జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం జగన్ పాదయాత్ర చేస్తారని.. దీనివల్ల అధికార పార్టీకి ఇబ్బంది తప్పదని తెలుస్తోంది. అందువల్లే జగన్ విషయంలో అరెస్ట్ కాకుండా.. ఆయనను రాజకీయంగా.. ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలను కూటమి ప్రభుత్వ పెద్దలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ జగన్ ను అరెస్ట్ చేయకపోతే వైసిపి మరోరకంగా సవాల్ విసురుతుంది. దానికి కూడా కూటమినేతలు సమాధానం చెప్పుకోవాలి. అటు అరెస్ట్ చేయకుండా.. ఇటు వైసిపి వేస్తున్న ప్రశ్నల నుంచి తప్పించుకోవాలంటే కూటమి పెద్దలు ఎటువంటి వ్యూహాలు రచిస్తారు.. ఎటువంటి ప్రణాళికలు అమలు చేస్తారు.. అనే విషయాల మీద క్లారిటీ రావాలి. అప్పుడే టిడిపి నేతలు కాస్త సంతృప్తి ఉంటుంది.