Homeఆంధ్రప్రదేశ్‌Richest Small Countries: పేదరికం లేని మూడు చిన్న దేశాలు.. సంపద, భద్రతలో అద్భుతం

Richest Small Countries: పేదరికం లేని మూడు చిన్న దేశాలు.. సంపద, భద్రతలో అద్భుతం

Richest Small Countries: ప్రపంచంలో పరిమాణం చాలా చిన్నగా ఉన్నా సంపదలో అగ్రస్థానంలో నిలిచిన మూడు దేశాలు ఉన్నాయి. మొనాకో, లక్సెంబర్గ్, లిక్టెన్‌స్టైన్‌. ఇవి పెద్ద దేశాల్లాగా విస్తీర్ణం లేకపోయినా, తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, భద్రతలో అసాధారణంగా ముందున్నాయి. పేదరికం అనే పదం ఇక్కడ దాదాపు అస్తిత్వం లేని స్థాయికి చేరుకుంది. వీటి విజయం వెనుక చిన్న పరిమాణం, తెలివైన విధానాలు, ప్రత్యేక ఆర్థిక నమూనాలు ఉన్నాయి. మన పల్లెటూరు కన్నా చిన్నది మొనాకో.. మొనాకో […]

Richest Small Countries: ప్రపంచంలో పరిమాణం చాలా చిన్నగా ఉన్నా సంపదలో అగ్రస్థానంలో నిలిచిన మూడు దేశాలు ఉన్నాయి. మొనాకో, లక్సెంబర్గ్, లిక్టెన్‌స్టైన్‌. ఇవి పెద్ద దేశాల్లాగా విస్తీర్ణం లేకపోయినా, తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, భద్రతలో అసాధారణంగా ముందున్నాయి. పేదరికం అనే పదం ఇక్కడ దాదాపు అస్తిత్వం లేని స్థాయికి చేరుకుంది. వీటి విజయం వెనుక చిన్న పరిమాణం, తెలివైన విధానాలు, ప్రత్యేక ఆర్థిక నమూనాలు ఉన్నాయి.

మన పల్లెటూరు కన్నా చిన్నది మొనాకో..
మొనాకో ప్రపంచంలోని రెండో అతి చిన్న దేశం. దాని విస్తీర్ణం కొన్ని చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఒక గంటలో దేశం మొత్తం చుట్టి రావచ్చు. అయినా ఇక్కడ భూమి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రతి అడుగు స్థలం కోట్ల రూపాయల విలువైనది. ఖరీదైన కార్లు రోడ్లపై సాధారణం. బాలీవుడ్, హాలీవుడ్‌ స్టార్స్, ప్రముఖ క్రీడాకారులు ఇక్కడ స్థిరపడాలని ఆశిస్తారు. ఇక్కడి ప్రత్యేకతల్లో ఒకటి పన్ను విధానం. నివాసితులు వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీని వల్ల సంపన్నులు ఆకర్షితులవుతారు. ప్రతి ఇద్దరిలో ఒకరు కోటీశ్వరుల స్థాయిలో ఉండే వాతావరణం ఉంది. భద్రత విషయంలో అత్యాధునిక స్థాయి. అడుగడుగునా కెమెరాలు, హైటెక్‌ పోలీసు వ్యవస్థ ఉండటం వల్ల నేరాలు చాలా తక్కువ. వైద్య సదుపాయాలు అధునాతనంగా ఉండటం, క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రజల సగటు ఆయుర్దాయం 90 ఏళ్లు రోడ్డుపై చొక్కా లేకుండా నడవడం లేదా చెత్త వేయడం వంటివి భారీ జరిమానాకు దారితీస్తాయి. మొనాకో గ్రాండ్‌ ప్రిక్స్‌ ప్రపంచ ప్రసిద్ధి. రోడ్లపైనే వేగవంతమైన కార్‌ రేస్‌ జరుగుతుంది. 19వ శతాబ్దంలో నిర్మించిన కాసినో మరో ఆకర్షణ. కానీ స్థానికులు అందులో ఆడడం నిషేధం. విదేశీయుల కోసమే అది నిర్వహిస్తారు. ఇలా పర్యాటకం, ఫైనాన్స్, లగ్జరీ జీవనశైలి కలయిక ఈ చిన్న దేశాన్ని సంపదలో అగ్రస్థానానికి చేర్చింది.

యూరప్‌ పవర్‌హౌస్‌ లక్సెంబర్గ్‌
లక్సెంబర్గ్‌ విస్తీర్ణం గోవా కంటే చిన్నది. ఫ్రాన్స్, జర్మనీ మధ్య ఉన్న ఈ దేశాన్ని యూరప్‌ పవర్‌హౌస్‌గా పిలుస్తారు. సంపద విషయంలో ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటి. ఇక్కడ పని చేసే వ్యక్తికి కనీస వేతనం చాలా ఎక్కువ. నెలకు వేల యూరోలు అందుతాయి. ఇది సాధారణ ఉద్యోగులకు కూడా మంచి జీవన ప్రమాణాలు అందిస్తుంది. ఈ దేశం ప్రపంచ ఫైనాన్షియల్‌ హబ్‌గా పనిచేస్తుంది. పెద్ద పెద్ద బ్యాంకులు, పెట్టుబడి నిధులు ఇక్కడ కేంద్రీకృతమయ్యాయి. రోజూ వేల కోట్ల లావాదేవీలు జరుగుతాయి. వాతావరణం స్వచ్ఛంగా, పచ్చదనం ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని యూరప్‌ గ్రీన్‌ హార్ట్‌గా కూడా పిలుస్తారు. ప్రజలు సాధారణంగా ప్రశాంతంగా జీవిస్తారు. నమ్మకం ఎక్కువ. అనేక మంది మూడు భాషలు సులభంగా మాట్లాడగలరు. ఇలా ఆర్థిక శక్తి, పర్యావరణ సమతుల్యత, సామాజిక స్థిరత్వం కలిసి పేదరికాన్ని దూరం చేశాయి.

పర్వతాల మధ్య దాగిన లిక్టెన్‌స్టైన్‌..
ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌ సరిహద్దులో పర్వతాల మధ్య ఉన్న లిక్టెన్‌స్టైన్‌ చాలా మందికి పేరు కూడా తెలియని దేశం. దాని విస్తీర్ణం ఢిల్లీ కంటే చాలా చిన్నది. అయినా తలసరి ఆదాయం చాలా ఎక్కువ. ఇక్కడ పని చేసే వ్యక్తి సులభంగా మంచి సంపాదన సాధించగలడు. పొరుగు దేశాల నుంచి కూడా చాలా మంది ఉపాధి కోసం వస్తారు. ఈ దేశం బలం దాని పరిశ్రమల్లో ఉంది. అధునాతన యంత్రాలు, డెంటల్‌ ఉత్పత్తులు ముఖ్యంగా కృత్రిమ పళ్లు, ఫార్మా ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతాయి. మంచు పర్వతాలు, పచ్చని లోయలు ట్రెక్కింగ్, స్కీయింగ్‌కు ప్రసిద్ధి. ద్రాక్ష తోటల నుంచి నాణ్యమైన వైన్‌ తయారవుతుంది.

ఇప్పటికీ రాచరికం..
ఇక్కడ ఇప్పటికీ రాచరికం కొనసాగుతోంది. రాజు కోటలోనే నివసిస్తాడు. దేశానికి సైన్యం లేదు. శాంతిని గొప్ప ఆయుధంగా భావిస్తారు. విమానాశ్రయం కూడా లేదు. పొరుగు దేశాల సౌకర్యాలు వాడుకుంటారు. భద్రత అంత ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది రాత్రి తలుపులు కూడా వేసుకోరు. జాతీయ దినోత్సవం రోజున రాజభవనం అందరికీ తెరిచి ఉంటుంది. ఇలా పరిశ్రమలు, సహజ అందం, సామాజిక విశ్వాసం కలిసి ఈ చిన్న దేశాన్ని సంపన్నంగా నిలిపాయి.

పరిమాణం పెద్దది కాకపోయినా, సరైన విధానాలు ఉంటే సంపద సృష్టించవచ్చని ఈ దేశాలు చూపిస్తున్నాయి. పన్ను ప్రోత్సాహకాలు, ఫైనాన్స్‌ హబ్‌గా అభివృద్ధి, అధునాతన పరిశ్రమలు, క్రమశిక్షణ, భద్రత, విద్య–వైద్య సదుపాయాలు కలిసి పేదరికాన్ని తగ్గించాయి. చిన్న జనాభా కారణంగా వనరులు సమర్థవంతంగా పంపిణీ అవుతాయి. ఇవి పెద్ద దేశాలకు కూడా పాఠాలు నేర్పుతున్నాయి. దేశాలు చిన్నవే అయినా, ప్రపంచంలో సంపద, భద్రత, జీవన ప్రమాణాల్లో ముందున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper