Undavalli Arun Kumar: కొందరు శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకొకరిపై పోరాటం చేయడంతోనే వారిలో సంతృప్తి కనిపిస్తుంది. అటువంటివారే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో అవకతవకలు జరిగాయి అంటూ ఆయన రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. మధ్యలో ఎన్నెన్నో ఆర్థిక సంస్థలు మోసగించాయి. ప్రజల వద్ద డిపాజిట్లు సేకరించి ముఖం చాటేసాయి. అంతవరకు ఎందుకు అగ్రిగోల్డ్ సంస్థ లక్షలాదిమందిని మోసం చేసింది. అటువంటి వాటిపై న్యాయపోరాటం చేయాల్సిన ఉండవల్లి లాంటివారు మార్గదర్శిపై ఎంచుకున్నారు. అందులో తప్పులేదు కానీ.. డిపాజిటర్లకు న్యాయబద్ధంగా చెల్లింపులు చేస్తున్నామని మార్గదర్శి చెప్పింది. అదే సమయంలో ఖాతాదారులు తమకు మోసం జరిగిందని ఎక్కడ కూడా ఫిర్యాదులు చేయలేదు. కానీ అదే పనిగా మార్గదర్శిపై పడ్డారు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ ఆయన ప్రయత్నానికి సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్ రెండు దశాబ్దాలుగా చేసిన పోరాటం వృధా ప్రయాసగా మిగిలింది.
* రెండు దశాబ్దాలుగా పోరాటం..
మార్గదర్శి ఫైనాన్స్ వ్యవహారంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన బురద జల్లుడు కార్యక్రమానికి బ్రేక్ పడినట్టే. మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి ఆ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ కీలక తీర్పు వెల్లడించింది. అసలు ఈ కేసులో పిటిషన్ వేయడానికి, పోరాటం చేయడానికి అసలు మీరెవరు అంటూ ధర్మాసనం నేరుగా ప్రశ్నించింది. ఇది ప్రజా ప్రయోజనం కోసం వేసిన పిటిషన్ లా లేదని.. వ్యక్తిగత వివాదంలో మాత్రమే కనిపిస్తోంది అంటూ న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో మీరు వాదించే కొద్ది మీ పైనే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి అంటూ వ్యాఖ్యానించడం విశేషం.
* తెలంగాణ కోర్టు అనుకూల తీర్పు..
వాస్తవానికి మార్గదర్శి కేసులో తెలంగాణ హైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది. అయినా సరే ఉండవల్లి అరుణ్ కుమార్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మొదటిసారి ఎంపీ అయ్యారు 2004లో ఉండవల్లి అరుణ్ కుమార్. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈనాడుపై వ్యతిరేకతగా ఉండేవారు. ఆ యాజమాన్యంలో నడుస్తున్న మార్గదర్శిపై దృష్టి పెట్టారు. రాజకీయ ప్రేరేపితంగానే ఉండవల్లి అరుణ్ కుమార్ చర్యలు ఉండేవని విమర్శలు ఉండేవి. కానీ ఆయన మాత్రం డిపాజిటర్లకు భారీ అన్యాయం జరుగుతోందని న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటివరకు దాదాపు 2500 కోట్ల రూపాయలపైగా మొత్తాన్ని డిపాజిటర్లకు విజయవంతంగా తిరిగి చెల్లించినట్లు మార్గదర్శి చెప్పింది. కేవలం ఐదు కోట్ల వరకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సి ఉందని.. దానిని కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ జరిగినట్లు సుప్రీంకోర్టుకు మార్గదర్శి నివేదించడంతో పిటిషన్ డిస్మిస్ అయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుతో మార్గదర్శి సంస్థపై దశాబ్దాలుగా సాగిన ఆరోపణలు, విమర్శలకు చెక్ పడింది. మార్గదర్శి వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు తన జీవిత కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటైన ఈ వివాదంలో.. ఏ ఒక్క డిపాజిటర్ కూ రూపాయి నష్టం కలగకుండా కాపాడడమే కాకుండా.. వ్యాపార విలువలను నిలబెట్టారనే నిజం మరోసారి రుజువయింది. ఈ తీర్పు ద్వారా రామోజీరావు నిజాయితీకి, ధర్మ పోరాటానికి సంపూర్ణ విజయం చేకూరునట్లు అయ్యింది. ఉండపల్లి అరుణ్ కుమార్ కు గట్టి షాక్ తగిలింది.