Nimmagadda Prasad: అక్రమ ఆస్తుల కేసులో నాడు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచిన వారికి కోర్టులు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ చేరిపోయారు. ఆయనకు సుప్రీంకోర్టు ఊహించని విధంగా తీర్పు ఇచ్చింది.
నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ అక్రమాస్తుల కేసులో అత్యంత కీలకంగా వ్యాన్ పిక్ ప్రాజెక్ట్ నిలిచింది. నాడు జగన్ కంపెనీలలో పెట్టుబడుల వ్యవహారంలో హైదరాబాద్ నగరానికి చెందిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాన్ పిక్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది. యూఏఈ ప్రాంతానికి చెందిన రాఖియా అనే సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిని గతంలోనే తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు బెంచ్ సమర్థించింది.
లావాదేవీల మీద అనుమానాలు
నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాపార లావాదేవీల మీద న్యాయస్థానం అనుమానం వ్యక్తం చేసింది. తమకు సమర్పించిన ఆస్తులు.. నగదు వంటి వాటితో ఏకీభవించని కోర్టు.. రెండు వారాల్లో మరో 200 కోట్లు కోర్టులో డిపాజిట్ చేయాలని.. నిమ్మగడ్డ ప్రసాద్.. ఇతర సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
వ్యాన్ పిక్ అనే ప్రాజెక్టులో పెట్టుబడులు
రాఖీయా అనే సంస్థ వ్యాన్ పిక్ అనే ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టింది. అయితే వాటిని నిమ్మగడ్డ ప్రసాదు దారి మళ్ళించాలని యూఏఈ కోర్టులో రాఖియా దావా వేసింది. ఈ విషయంలో అసలు.. వడ్డీ మొత్తం కలిపి చెల్లించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఆ బకాయిలు ఏకంగా 950 కోట్ల వరకు చేరుకున్నాయి. విదేశాలలో కోర్టు ఇచ్చిన తీర్పును ఇక్కడ కూడా అమలు చేయాలని రాఖీయా సంస్థ హైదరాబాద్.. రంగారెడ్డిలోని వాణిజ్య న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ కుటుంబానికి సంబంధించిన సంస్థలు కోర్టుకు ఇచ్చిన మాట తప్పి వేరే విధంగా ఫార్మా ఒప్పందాలు పూర్తిచేసి ఆస్తులకు మసి పూసి మారేడు కాయ చేసేలా ప్రయత్నిస్తున్నాయని రాఖీయా సంస్థ తెలంగాణ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ వేసింది.
200 కోట్లు నగదు డిపాజిట్ చేయాలి
ఈ అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయస్థానం లోతుగా పరిశీలించింది. శాశ్వతమైన హామీ ఇందులో కనిపించకపోవడంతో టెక్నికల్ గా ఈ కేసును కోర్టు ధిక్కరణగా భావించలేమని వివరించింది. సంస్థల పేర్లు మార్చడం.. వాటాలకు సంబంధించిన బదిలీలు.. ఇవన్నీ కూడా నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులను వేరే వైపు పంపిస్తున్నట్టు రాఖీయా సంస్థ చెందుతున్న ఆందోళనలో నిజం ఉందని సుప్రీంకోర్టు భావించింది. ఈ వ్యవహారంలో సరైన పూచికత్తు కావాలని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. కోర్టులో 200 కోట్లు నగదు డిపాజిట్ చేయాలని సూచించింది మరోవైపు నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఉన్న వివిధ సంస్థల ఆస్తుల నుంచి బకాయిలను వసూలు చేసుకునే వ్యవహారంలో కీలకమైన అంశాలను రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఉన్న వాణిజ్య న్యాయస్థానాలు తేల్చి చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది. గడచిన మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ వ్యవహారాలను వచ్చే నాలుగు నెలల కాలంలో పూర్తి చేయాలని దిగువ స్థాయి న్యాయస్థానాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.