Jogi Ramesh And Janardhan Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ములకలచెరువు ప్రాంతంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కల్తీ మద్యం కథలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వైసిపి పన్నిన కుట్ర బయటపడుతోంది.
ఇటీవల ములకలచెరువు కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు కీలక విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. జోగి రమేష్ చెబితేనే తాను ఈ వ్యవహారం సాగించానని.. జోగి రమేష్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని జనార్దన్ రావు వెల్లడించిన విషయం తెలిసిందే. జనార్దన్ రావు ఈ విషయాలను వెల్లడించడానికి ముందు ఆఫ్రికాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరుల కల్తీ మద్యం దందా బయటపడింది. కల్తీ మద్యం వల్ల ఆఫ్రికాలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి ప్రభుత్వాలు విచారణకు కూడా ఆదేశించాయి. ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకు జనార్దన్ రావు ములకలచెరువు వ్యవహారంలో అసలు నిజాలను వెల్లడించాడు. జోగి రమేష్ పాత్ర.. ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీకి తీసుకొచ్చిన యంత్రాలు.. కల్తీ మద్యం తయారు చేస్తున్న విధానం.. దానివల్ల ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన తీరు.. ఇలా అనే విషయాలను జనార్దన్ రావు వెల్లడించారు.

జనార్దన్ రావు సంచలన విషయాలను వెల్లడించిన తర్వాత జోగి రమేష్ బయటకు వచ్చారు. ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు. జనార్దన్ రావు తో తన సంబంధం లేదని.. నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. జోగి రమేష్ వ్యాఖ్యలకు వైసీపీ అనుకూల మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చింది. కూటమి ప్రభుత్వం కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడింది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అంతా ఈజీగా వదిలిపెట్టలేదు. పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తుంటే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జోగి రమేష్, జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్ రావు కలిసి ఉన్న ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. అందులో ఓ ఫంక్షన్ లో ముగ్గురు ఒకే పక్కన కూర్చున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. తను ఎవరో తెలియదని ఇన్ని రోజులపాటు జనార్దన్ రావు గురించి గొంతు చించుకున్న రమేష్.. ఇప్పుడు ఏం మాట్లాడతారని కూటమినేతలు అంటున్నారు. సరిగ్గా మొన్న ఎక్సైజ్ అధికారులకు జనార్దన్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత జోగి రమేష్ తో చేసిన వాట్సాప్ చాట్ ను బయటపెట్టాడు. ఇప్పుడు ఏకంగా ఫోటోలు బయటికి రావడంతో నకిలీ మద్యం వ్యవహారంలో వైసిపి చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

నకిలీ మద్యం తయారీకి అత్యంత ప్రమాదకరమైన పదార్థాలను ఉపయోగించారని తెలుస్తోంది. దీనికి తోడు వైసిపి అనుకూల మీడియా నకిలీ మద్యం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారని వార్తలు రాసింది. ఈ వార్తలకు ఆధారాలు చూపించాలని ఏపీ ప్రభుత్వం వైసీపీ అనుకూల మీడియా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది. వైసిపి అనుకూల మీడియా లో పనిచేసే నెల్లూరు బ్యూరో చీఫ్ ఇటీవల ప్రభుత్వం పై అడ్డగోలుగా కథనాలు రాశాడు. నకిలీ మద్యం వల్ల నెల్లూరు జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వార్త రాశాడు. దీనికి ఆధారాలు చూపించాలని ఏపీ పోలీసులు నోటీసులు పంపిస్తే తీసుకోవడానికి వైసిపి అనుకూల మీడియా ప్రతినిధులు నిరాకరించారు. పోలీసులు వారి గృహాల వద్దకు వెళితే తప్పించుకుని పారిపోయారు. ఇక వైసిపి అనుకూల మీడియాను నడిపిస్తున్న వ్యక్తికి ఏపీ పోలీసులు నోటీసులు ఇస్తే.. పత్రిక స్వేచ్ఛ మీద దాడి అంటూ వైసీపీ అనుకూల మీడియా ధర్నాలు, ఆందోళనలు చేయడం విశేషం. అయితే ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ఇంకా అనేక విషయాలు వెలుగు చూడాల్సి ఉందని ఏపీ పోలీసులు చెబుతున్నారు.