Balineni Srinivasa Reddy: స్థానిక ఎన్నికలపై జనసేన హై కమాండ్ ఫోకస్ పెట్టింది. స్థానిక ఎన్నికల్లో జన సైనికుల ఆత్మగౌరవం నిలబెడతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 14 మందితో కమిటీని కూడా ప్రకటించారు. అయితే ఇందులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో అన్ని రకాల ముఖ్య కమిటీల్లో బాలినేని ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం మొండి చేయి చూపారు. దీంతో రకరకాల ప్రచారం నడుస్తోంది. దాదాపు పార్టీలో ముఖ్య నాయకులు అందరికీ ఈ కమిటీలో స్థానం కల్పించారు. కానీ బాలినేని విషయంలో మాత్రం పక్కన పెట్టడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. ఇటీవల జరిగిన పరిణామాలతోనే బాలినేనిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కూటమికి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే ప్రకటనలు చేయడం వల్లే ఆయనకు కమిటీలో స్థానం దక్కలేదని సమాచారం.
* 14 మందితో కమిటీ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఒక 14 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ఈ కమిటీలు మండలి బుద్ధ ప్రసాద్, టి.శివ శంకర్, కందుల దుర్గేష్, వల్లభనేని బాల సౌరి, బొలిశెట్టి శ్రీనివాస్, దేవ వరప్రసాద్, సిహెచ్ వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, పత్సమట్ల ధర్మరాజు, చిలకమ్మా మధుసూదన్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు, సామినేని ఉదయభాను, యనమల భాస్కర్, కురికన రవికుమార్ సభ్యులుగా ఉన్న కమిటీని జనసేన హై కమాండ్ అధికారికంగా ప్రకటించింది. కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మాత్రం ఈ కమిటీలో చోటు కల్పించలేదు.
* గతంలో గౌరవం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటివరకు పార్టీ పరంగా ఆయనకు మంచి గుర్తింపు ఉండేది. జనసేన జాయినింగ్స్ కమిటీ, స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్ కు సంబంధించి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ బాధ్యతలను బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇదివరకు అప్పగించారు. అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విధివిధానాల రూపకల్పన కమిటీలో మాత్రం చోటు దక్కకపోవడం పై రకరకాల రచ్చ నడుస్తోంది. ఇటీవల ఒంగోలు టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనతో జరిగిన వివాదం మూలంగానే బాలినేనిని పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. కూటమిలో విచ్చిన్నం కోసమే బాలినేని జనసేనలో చేరారు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే టిడిపి నుంచి అభ్యంతరాలు వస్తుండడంతోనే పక్కన పెట్టారని టాక్ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు బాలినేని. జగన్మోహన్ రెడ్డితో విభేదించి జనసేనలో చేరారు. మళ్లీ తిరిగి వైసీపీలోకి వెళ్లిపోతారని జోరుగా ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు కీలకమైన జనసేన కమిటీలో ఆయనకు చోటు లభించకపోవడంపై రకరకాల చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..