Homeఆంధ్రప్రదేశ్‌Cyclone Murasu : అక్కడ ‘మురసు’ తుపాను తీరం దాటే అవకాశం.. ఏపీలో హై అలర్ట్!

Cyclone Murasu : అక్కడ ‘మురసు’ తుపాను తీరం దాటే అవకాశం.. ఏపీలో హై అలర్ట్!

Cyclone Murasu : ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాన్ని మరో తుపాను వణికించేందుకు సిద్ధమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను (Cyclone Murasu) రాష్ట్ర తీరంవైపు వేగంగా కదులుతోంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆరు జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) బృందాలు, ఏడు రాష్ట్ర విపత్తు స్పందన […]

Cyclone Murasu : ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాన్ని మరో తుపాను వణికించేందుకు సిద్ధమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను (Cyclone Murasu) రాష్ట్ర తీరంవైపు వేగంగా కదులుతోంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆరు జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) బృందాలు, ఏడు రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) బృందాలను రంగంలోకి దించింది. వారం రోజుల్లోపే ఏపీ తీరాన్ని ప్రభావితం చేయనున్న రెండో తుపాను కావడంతో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.

ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం

భారత వాతావరణ శాఖ (IMD) నవంబర్ 1వ తేదీ రాత్రి 9 గంటలకు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. మురసు తుపాను నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. సాయంత్రం 5.30 గంటల సమయానికి ఇది చెన్నైకి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, నెల్లూరుకు ఆగ్నేయంగా 490 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 500 కిలోమీటర్లు, కావలికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, ఒంగోలుకు ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 560 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించింది.

ఈ తుపాను నవంబర్ 2 తెల్లవారుజామున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం నవంబర్ 3 తెల్లవారుజామున ఒంగోలు తీరానికి సమీపంలో తీరం దాటే అవకాశముందని తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

మురసు తుపాను ప్రభావంతో సోమవారం (నవంబర్ 2) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తుపాను ప్రభావం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని, తదుపరి హెచ్చరికలు వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచిస్తున్నారు.

విద్యాసంస్థలకు సెలవు

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. నవంబర్ 2, సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యార్థులు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

తుపాను సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఆరు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఏడు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభావిత జిల్లాల్లో మోహరించింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అత్యవసర సహాయం కోసం ఈ నంబర్లకు ఫోన్ చేయండి

తుపాను కారణంగా ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవ ద్వారా 95523 00009 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తు నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

తుపాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు, భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, పాత భవనాలకు దూరంగా ఉండాలి. అధికారుల నుంచి వచ్చే సూచనలు, వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper