Homeఆంధ్రప్రదేశ్‌Amaravati: అమరావతి అద్భుత నగరి.. చంద్రబాబు మదిలో ఉన్నవి ఇవే..

Amaravati: అమరావతి అద్భుత నగరి.. చంద్రబాబు మదిలో ఉన్నవి ఇవే..

Amaravati:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిస్థాయి రాజధాని అవసరమైన లక్ష్యంతో అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఆయన.. ఇప్పుడు మరోసారి రాజధాని పనులను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా.. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో వివిధ ప్రాజెక్టులపై నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతి నిర్మాణ పనులు […]

Amaravati:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిస్థాయి రాజధాని అవసరమైన లక్ష్యంతో అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఆయన.. ఇప్పుడు మరోసారి రాజధాని పనులను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా.. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో వివిధ ప్రాజెక్టులపై నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నారు.

అమరావతి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయడానికి చంద్రబాబు అధికారులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తూ.. పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు. నిర్ణీత గడువు లోగా పనులు పూర్తి చేయాలని.. నాణ్యత విషయంలో రాజీ పడవద్దు అని సూచిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన సమీక్షలో సుమారు 50వేల 999 కోట్ల విలువైన 95 ప్రాజెక్టుల పురోగతిని చంద్రబాబు పరిశీలించారు. ప్రతి నెల కనీసం 7.92 క శాతం పురోగతి సాధించాలని నిర్మాణ సంస్థలకు ఇప్పటికే చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు.

అమరావతి నగరంలో రోడ్లు.. తాగునీరు.. డ్రైనేజీ.. విద్యుత్.. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1437 కోట్లను సి ఆర్ డి ఏ ఆమోదించింది. సచివాలయం భవనాలు.. అసెంబ్లీ.. హైకోర్టు.. ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కొనసాగుతోంది. రాజధానిలో పెట్టుబడులు.. విద్యాసంస్థలు.. పరిశ్రమలు పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాజధాని అభివృద్ధికి రవాణా వ్యవస్థ అత్యంత కీలకమని భావిస్తున్న ప్రభుత్వం.. రైల్వే కనెక్టివిటీ మీద కూడా దృష్టి పెట్టింది. ఎర్రుపాలెం.. అమరావతి.. నంబూరు మధ్య 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతికి విజయవాడ.. గుంటూరు ప్రాంతాల నుంచి రైలు మార్గంలో కనెక్టివిటీ మెరుగుపడుతుంది. కృష్ణా నది మీద రైల్వే వంతెన నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకం.

అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో చంద్రబాబు విదేశీ సంస్థలు.. పెట్టుబడిదారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా సింగపూర్ సహకారాన్ని మరింత విస్తరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. నవంబర్ 11న ఆంధ్రప్రదేశ్.. సింగపూర్ భాగస్వామ్యంపై జరిగిన సమావేశంలో సింగపూర్ మంత్రి గాన్ సీయో హువాంగ్ నేతృత్వంలో ప్రతినిధుల బృందంతో చంద్రబాబు చర్చలు నిర్వహించారు. రాజధాని నిర్మాణం.. నైపుణ్యాభివృద్ధి.. సాంకేతిక రంగాలలో సహకారం మీద ఆయన చర్చించారు. అమరావతి.. పోలవరం ప్రాజెక్టులకు 2027 మార్చి నాటికి లక్ష్యాలను చేరుకోవాలని ఆయన సూచించారు.

అమరావతిని కేవలం పరిపాలన రాజధానిగా మాత్రమే కాకుండా.. సాంకేతిక.. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు ప్రణాళిక. క్వాంటం టెక్నాలజీ.. సెమీ కండక్టర్లు.. అంతర్జాతీయ సాంకేతికత.. డ్రోన్ల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణానికి 1208.41 కోట్లు.. సచివాలయం.. సాధారణ పరిపాలన విభాగం.. హెచ్ వో డీ టవర్ల పనులకు 2540 కోట్లు.. అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు 798 కోట్ల నిధులను ఆమోదించారు.

అమరావతి నిర్మాణం చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలోనే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో కీలకమైన అంశంగా మారబోతోంది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల ఆశలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో నిధుల సమీకరణ.. భూ సమీకరణ.. నిర్మాణ సంస్థల పనితీరు.. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయడం వంటి సవాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు చేస్తున్న సమీక్షలు.. కేంద్రంతో సాగిస్తున్న సమన్వయం.. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిల ప్రయత్నాలు.. అమరావతి నగర నిర్మాణంలో కీలకపాత్ర పోషించబోతున్నాయి. చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు గనుక పూర్తయితే అమరావతి ఏపీలోనే కాకుండా.. దేశంలోనే అద్భుతమైన నగరంగా రూపు దిద్దుకునే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper