YSR Congress: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే నేరుగా ప్రజా సమస్యలపై కాకుండా కొన్ని రకాల వివాదాలను ఎంపిక చేసుకుంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం దగా డిఎస్సి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుపుతోంది. దానికి ధీటుగా డీఎస్సీ 2025 ద్వారా ఎంపికైన కొత్త ఉపాధ్యాయులు ఆత్మగౌరవం పేరుతో ఆందోళన కార్యక్రమాలు జరుపుతున్నారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గడం లేదు. జెన్ జీ పేరుతో దగా డీఎస్సీ అంటూ కొనసాగిస్తోంది. ఎక్కడికక్కడే పోలీస్ శాఖ సెక్షన్ 30 అమలు చేస్తున్న వెనక్కి తగ్గడం లేదు. అరెస్టులు జరుగుతున్నా లెక్కచేయడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే ఏకంగా ప్రైవేటు పోలీస్ సైన్యాన్ని రంగంలోకి దించడం ఆందోళన కలిగిస్తోంది.
* అలా చేస్తే నేరం..
సాధారణంగా పోలీస్ శాఖ యూనిఫామ్ తో పాటు చిహ్నాలు ప్రత్యేకం. ప్రత్యేక పోలీస్ చట్టం ప్రకారం రూపొందించుకుంటారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ అనేది పోలీస్ శాఖ ప్రథమ విధి. అందుకే పోలీస్ చట్టాలు సైతం కఠినంగా ఉంటాయి. పోలీస్ యూనిఫారం తో పాటు చిహ్నాలను పోలి ఉండడం నేరం. నిబంధనలకు విరుద్ధం కూడా. అయితే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయితే పోలీసులు మాదిరిగా ఒక ప్రైవేటు సైన్యం కనిపించింది. అచ్చం పోలీసులు మాదిరిగా ఖాకీ యూనిఫారం. ఆపై పోలీస్ చిహ్నాలతో పాటు వాకీ టాకీలతో కొంతమంది కనిపించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ స్పందించింది. ఆ ప్రైవేట్ పోలీస్ సైన్యాన్ని అదుపులోకి తీసుకుంది.
* అచ్చం పోలీసుల మాదిరిగా..
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ దగా డీఎస్సీ ఆందోళనల నేపథ్యంలో.. ఎక్కడికక్కడే అరెస్టుల పర్వం నడుస్తోంది. పోలీసులు ఈ ఉద్యమంపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ తరుణంలో చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసుల మాదిరిగా కొంతమంది కనిపించారు. ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు చెందిన మనుషులు వాళ్లు. కేవలం పోలీసుల అరెస్టులనుంచి తప్పించుకునేందుకు.. ప్రజల మైండ్ ను డైవర్ట్ చేసేందుకు అలా ప్రవర్తించారు అన్నది ఇప్పుడు తెలుస్తోంది. ఆ నియోజకవర్గానికి చెందిన నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాష్ట్రస్థాయి నాయకుడిగా కొనసాగుతున్నారు.. ఆయన కనుసన్నల్లోనే ఈ ప్రైవేటు పోలీసు సైన్యం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే పోలీస్ శాఖ అదుపులో ఆ ప్రైవేట్ సైన్యం ఉంది.