Homeఆంధ్రప్రదేశ్‌liquor scam AP: ఢిల్లీ స్కాం కంటే పది రెట్లు.. సెగలు పుట్టిస్తున్న ఏపీ మద్యం...

liquor scam AP: ఢిల్లీ స్కాం కంటే పది రెట్లు.. సెగలు పుట్టిస్తున్న ఏపీ మద్యం కుంభకోణం!

liquor scam AP: ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొట్టి పారేస్తోంది. ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర కేసుగా అభివర్ణిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే మాత్రం తప్పనిసరిగా మద్యం కుంభకోణం జరిగి ఉంటుందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఒకప్పటి వైసిపి కీలక నేత విజయసాయిరెడ్డి సైతం మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా సిట్టింగులు కూడా జరిగాయని.. అందులో తాను సైతం పాల్గొన్నానని.. తనకు మాత్రం సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి తొలి చార్జీ షీట్ ను కోర్టుకు సమర్పించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఒకటి కాదు రెండు కాదు మూడు 3,500 కోట్ల రూపాయల కుంభకోణం ఇది అని తేల్చేసింది. త్వరలో అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తెలుస్తామని కూడా స్పష్టం చేసింది. 20 రోజుల్లో మరో చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పింది.

Also Read: కాంగ్రెస్ మద్దతు కోసం విజయసాయిరెడ్డి.. కొత్త అవతారం!

నిషేధం పక్కనపెట్టి వ్యాపారం..
వాస్తవానికి 2019 ఎన్నికల్లో మద్య నిషేధం హామీ ఇచ్చారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). నవరత్నాల్లో భాగంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దశలవారీగా దుకాణాలను మూసివేస్తామని చెప్పి.. స్వయంగా ప్రభుత్వమే నడిపే విధంగా మద్యం పాలసీని అమాంతం మార్చారు. అక్కడే మద్యం కుంభకోణానికి బీజం పడింది. ఎక్కడో కేంద్రం సర్వీసులో ఉన్న అధికారిని తెచ్చి మద్యం పాలసీని తయారు చేసే బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రాజ్ కసిరెడ్డిని తెచ్చి సూత్రధారిగా మార్చారు. ఎంపీ మిధున్ రెడ్డి తెర వెనుక ఉండి నడిపించారు. మద్యం తయారీదారులతో పాటు డిస్టలరీలను తమ అదుపులోకి తెచ్చుకున్నారు. నాసిరకం మద్యం తయారీని ప్రోత్సహించారు. తద్వారా ప్రతీ సీసాకు కమీషన్ ఇంతా అని నిర్దేశించారు. అప్పటివరకు ఉన్న ప్రీమియం మద్యం బ్రాండ్లు కనిపించకుండా పోయాయి. చాలా రకాల కొత్త బ్రాండ్లు కనిపించాయి. దేశవ్యాప్తంగా వినిపించని బ్రాండ్లు సైతం ఏపీలో దర్శనం ఇవ్వడం విశేషం. షాపులు నడిపేది ప్రభుత్వం.. మద్యం కంపెనీలు వైసీపీ నేతలువి.. డిష్టలరీలు వారి కంట్రోల్ లోనే ఉండేవి.. కేవలం మద్యం పాలసీ మారింది. కానీ నడిపేది వైసిపి నేతలు. లబ్ధి పొందింది వారే. కానీ నాసిరకం మద్యంతో ప్రజారోగ్యానికి తీరని భంగం వాటిల్లింది. దాదాపు 30 వేల మందికి పైగా నాసిరకం మద్యానికి బలయ్యారని ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి.

ఆ సొమ్ముతోనే వ్యాపారాలు..
అయితే మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి( rajkas Reddy ). కానీ ఆయన వెనుక ఉండి నడిపించింది అంతా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం వ్యాపారం, రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరపడం, విదేశాల్లో మైనింగ్ వంటివి చేశారని గుర్తించింది సిట్. మద్యం పాలసీలో కీలక పాత్ర పోషించారు అప్పటి బేవరేజస్ చైర్మన్ వాసుదేవ రెడ్డి. వాస్తవానికి ఆయన ఈ రాష్ట్రానికి చెందిన అధికారి కాదు. ఐఆర్ఎస్ అధికారిగా ఉండేవారు. ఆయనను డిప్యూటేషన్ పై తీసుకొచ్చి అస్మదీయ అధికారిగా మార్చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారిగా ఉన్న సత్య ప్రసాద్ ని కన్వర్టెడ్ ఐఏఎస్ గా పదోన్నతి కల్పిస్తామని ప్రలోభ పెట్టారు. వారిద్దరిని పావుగా మార్చుకొని దోపిడీకి పాల్పడింది మాత్రం మిధున్ రెడ్డి అని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

అదంతా బహిరంగ రహస్యమే..
అయితే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరు అన్నది బహిరంగ రహస్యమే. కానీ ఈ బృందంలో ఎక్కువ లాభ పడింది మాత్రం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి( Mithun Reddy). ప్రతి నెలా 5 కోట్ల రూపాయల వరకు మిధున్ రెడ్డికి వాటాల రూపంలో వెళ్లేవని తెలుస్తోంది. ఆయన కుటుంబీకులు డైరెక్టర్లు గా ఉన్న పి ఎల్ ఆర్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లో ఆ నగదును జమ చేసుకున్నట్లు తేలింది. అయితే ఒక పద్ధతి ప్రకారం మద్యం కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేవలం నగదు అమ్మకాలకు మాత్రమే ప్రోత్సహించారు. గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ లావాదేవీలు పైకి చూపి.. నగదు అమ్మకాల ద్వారా కుంభకోణానికి తెరలేపినట్లు సిట్ విచారణలో స్పష్టమైంది.

Also Read:  పరుపు, దిండు, ఓ దోమతెర.. జైల్లో మిథున్ రెడ్డి కోరికల చిట్టా

అత్యంత సన్నిహితుల బృందంతో..
మరోవైపు మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు కీలక నేత అయితే.. అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress party) లబ్ధి చేకూర్చాలని భావించినట్లు సీట్ చెబుతోంది. మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన సొమ్మును 2024 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులకు పంచాలని ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో 40 మంది నిందితులు ఉండగా.. ఇప్పటివరకు అరెస్టయిన 12 మంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. వీరే ఈ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతో ఇతర వ్యాపారాలు చేశారు. అదే సొమ్మును హవాలా రూపంలో విదేశాలకు తరలించి మైనింగ్ వ్యాపారాన్ని చేపట్టారు. ఇలా దోచేసిన సొమ్మును 175 నియోజకవర్గాలకు పంపించి మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు వ్యూహరచన చేశారు. అయితే వీరు ఒకటి తలిస్తే దైవము ఒకటి తలచినట్టు.. ప్రజా తీర్పు తారుమారు కావడంతో.. ఏపీలో అధికారం మార్పిడి కావడంతో అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఆ సొమ్ముతో ఏం చేయదలుచుకున్నారో ఏపీ ప్రజలకు స్పష్టంగా తెలిసింది. ఈ విషయంలో మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాట్సాఫ్ చెప్పాల్సిందే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular