Liquor Scam YSRCP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మనసులో ఉన్న మాటేంటి? ఆయన రాజకీయాలను వదిలారా? వదిలించుకున్నారా? అసలు ఆయన తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? ఇస్తే ఏ పార్టీలో చేరుతారు? ఇలా రకరకాల చర్చ నడుస్తోంది. కొద్ది నెలల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు విజయసాయిరెడ్డి. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలో చేరనని కూడా చెప్పుకొచ్చారు. వ్యవసాయం చేసుకుంటానని బదులిచ్చారు. కానీ ఆయన వ్యవసాయం చేసుకున్న మాట పక్కన పెడితే.. నిత్యం రాజకీయాలలో హైలెట్ అవుతున్నారు. రాజకీయ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కోసారి కూటమికి దగ్గరగా ఉండేలా చూసుకుంటున్నారు. మరోసారి బిజెపికి దగ్గరయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఇంకోవైపు వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారని వార్తల్లో వచ్చేలా నిలుస్తున్నారు. ఇటువంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన ట్విట్ చేయడం పొలిటికల్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
Also Read: ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి ఏర్పాట్లు ఇవీ
వైసీపీకి అన్ని తానై
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పుట్టుకొచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డితో పార్టీ అవినీతి కేసులను ఎదుర్కొన్నారు. ఆయనతో పాటే జైలు జీవితం అనుభవించారు. జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు తెప్పించి సొంత పార్టీని ఏర్పాటు చేయించడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. ఏపీలో వైసిపి అధికారంలోకి వచ్చేందుకు విజయసాయిరెడ్డి చాలా విధాలుగా కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా కృషి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని విపరీతంగా ద్వేషించారు విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉన్న బిజెపి ప్రాపకం కోసం విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. అటువంటి విజయసాయిరెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ట్విట్ చేయడం సంచలనంగా మారింది.
మద్యం కుంభకోణంలో కాంగ్రెస్ సంచలన ఆరోపణలు..
ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మెడకు చుట్టుకుంటుంది. దాదాపు రూ.3,500 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు అనుమానిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. అదే సమయంలో ఈ కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి అరెస్టు సైతం ఉంటుందని ప్రచారం నడిచింది. మిథున్ రెడ్డి అరెస్ట్ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్చార్జ్ మాణికం ఠాగూర్ కీలక ప్రకటన చేశారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి సైతం సంబంధం ఉందని ప్రకటించారు. మద్యం కుంభకోణం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన హస్తము ఉందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. వైసీపీ నేతలను నిర్వీర్యం చేయడం ద్వారా బలపడవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రకటన చేశారు.
Also Read: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
మల్లికార్జున్ ఖర్గేకు అభినందనలు..
ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున కార్గే ఉన్నారు. ఆయన కర్ణాటక కు చెందిన నేత. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఆయన జన్మదినం. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకొని విజయసాయిరెడ్డి మల్లికార్జున్ ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో విజయసాయిరెడ్డిలో మద్యం కుంభకోణం విషయంలో భయం మొదలైందని ప్రచారం ప్రారంభమైంది. ఏపీలో మద్యం కుంభకోణం కేసులు కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ప్రకటనలు చేస్తోంది. అయితే ఆ ప్రకటనల దాడి తన వైపు రాకుండా చూసుకునేందుకే విజయసాయిరెడ్డి ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి