Nara Lokesh: ఏపీ రాజకీయాల్లో విజయవాడ ప్రత్యేకం. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, నవ్యాంధ్రప్రదేశ్ లో అయినా బెజవాడ రాజకీయానికి ప్రత్యేకత ఉంది. అక్కడ సుదీర్ఘకాలం ఫ్యామిలీ ఫైట్ నడిచింది. ముఖ్యంగా దేవినేని కుటుంబానికి మంచి పట్టు ఉంది ఆ ప్రాంతంలో. అయితే ఆ కుటుంబం నుంచి వచ్చిన దేవినేని అవినాష్ కు మాత్రం మంచి అవకాశాలు రావడం లేదు. పైగా వివాదాస్పద ముద్ర పడుతోంది. ఆయన రాజకీయ జీవితానికి అదే ఇబ్బందికర అంశం కూడా. 2019లో టిడిపి తరఫున గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అవినాష్.. తర్వాత వైసిపి గూటికి వెళ్లారు. అలా వెళ్లిన ఆయన టిడిపి నాయకత్వం పై తిరుగుబాటు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. ఈ క్రమంలో ఇప్పుడు టిడిపికి ఆయన టార్గెట్ అయ్యారు. మరోవైపు వైసీపీలో కూడా ఆయనకు ప్రాధాన్యత తగ్గింది. అందుకే ఇప్పుడు టిడిపి వైపు ఆయన చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* బెజవాడ రాజకీయాల్లో సుదీర్ఘకాలం..
అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ సుదీర్ఘకాలం బెజవాడ రాజకీయాలను శాసించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశంలో పనిచేశారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. తెలుగు దేశాన్ని వీడిన తర్వాత చంద్రబాబుతో తీవ్రస్థాయిలో విభేదించారు. కానీ 2014 ఎన్నికల తర్వాత కుమారుడు అవినాష్ రాజకీయ భవిష్యత్తు కోసం టిడిపిలో చేరారు నెహ్రూ. ఆ ఎన్నికల్లో అవినాష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి చెప్పుకోదగ్గ ఓట్లు తెచ్చుకున్నారు. కానీ రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ ఏపీలో నిలబడలేకపోయింది. దీంతో కుమారుడి కోసం చంద్రబాబుతో సంధి చేసుకున్నారు నెహ్రూ. అయితే కొద్ది రోజులకే నెహ్రూ అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకిచ్చిన మాట ప్రకారం అవినాష్ ను బాగా ప్రోత్సహించారు చంద్రబాబు.
* కొడాలి నాని పై ప్రయోగం..
2019 ఎన్నికల్లో అవినాష్ కు ఏదైనా ఒక సీటు ఇవ్వాలని భావించారు. కానీ అప్పటికే సిట్టింగులు ఉండడంతో వీలుపడలేదు. అయితే గుడివాడలో నాలుగు సార్లు గెలిచారు కొడాలి నాని. యువకుడు కావడంతో అక్కడి ప్రజలు ఆదరిస్తారని భావించి కొడాలి నాని పై దేవినేని అవినాష్ ను రంగంలోకి దించారు. అయితే ఆ సమయంలో గుడివాడ టిడిపిలో రావి వెంకటేశ్వరరావు రూపంలో సీనియర్ ఉన్నారు. ఆయనను ఒప్పించి మరి అవినాష్ కు లైన్ క్లియర్ చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ టీడీపీలో ఉండలేకపోయారు. టిడిపి నుంచి వైసీపీలో చేరిన తర్వాత ఏకంగా చంద్రబాబుతో పాటు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు అవినాష్. ఎంతో ఆదరించిన వారిపైనే ఆయన తిరగబడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్ ప్రకారం విమర్శలకు దిగారు.
* టిడిపికి కంచుకోట..
విజయవాడ తూర్పు నియోజకవర్గం అనేది టిడిపికి కంచుకోటగా మారిపోయింది. అక్కడ గద్దె రామ్మోహన్ రావు వరుసగా గెలుస్తూ వచ్చారు. అటువంటి నియోజకవర్గం నుంచి మూడేళ్లు ముందుగానే టికెట్ ఖరారు చేశారు జగన్మోహన్ రెడ్డి దేవినేని అవినాష్ కు. పైగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని నాని.. తూర్పు నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అయినా సరే ఆ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి అక్కడ అవినాష్కు సీటు ఇచ్చే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అవినాష్ టిడిపి వైపు చూస్తున్నట్లు సమాచారం. అందుకే తన భార్యను లోకేష్ వద్దకు పంపించి కేసుల విషయంలో రాజీ చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అవినాష్ వైసీపీలోకి వెళ్లిన తర్వాత చేసిన తప్పిదాలతో ఆయన టిడిపిలో చేరిక అంత ఈజీ కాదు. అందుకే దేవినేని నెహ్రూకు సన్నిహితుడైన గాలి ముద్దుకృష్ణమనాయుడు ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి ఈ ప్రయత్నాలు ఎంత వరకు వర్కవుట్ అవుతాయో.