Special Facilities for Mithun Reddy: ఏపీ మద్యం కుంభకోణంలో(AP liquor scam) అరెస్టయ్యారు ఎంపీ మిధున్ రెడ్డి. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే జైల్లో తనకు ప్రత్యేక వసతులు కావాలని ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి న్యాయస్థానం అంగీకరించింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టు ముందు ఉంచాలని రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ ను ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని రెండు రోజుల కిందట ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో హాజరు పరచగా ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి. ఆయనకు 4196 నెంబర్ కూడా కేటాయించారు.
కల్పించే వసతులు ఇవే..
అయితే తనకు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మిధున్ రెడ్డి( Mithun Reddy) న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అంగీకారం తెలిపింది. జైలులో టీవీ,మంచం, వెస్ట్రన్ కమోడ్, మూడు పూటలా బయట నుంచి భోజనం, దోమతెర, యోగ మేట్, వాకింగ్ షూస్, వార్తాపత్రికలు, ఒక సహాయకుడు, వారానికి ఐదు రోజులు పాటు ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు నిర్వహించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్నులు వంటి సదుపాయాలను కల్పించడానికి అంగీకారం తెలిపింది కోర్టు.
Also Read: ముందుకు కదలని వివేకానందరెడ్డి హత్య కేసు.. ఏం జరుగుతోంది?!
అభ్యంతరాలు తెలపాలని ఆదేశం..
అయితే మిధున్ రెడ్డి కోరిన వసతులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ ను ఆదేశించింది న్యాయస్థానం. మంగళవారం ఉదయం 10:30 గంటలకు కల్లా అభ్యంతరాలు న్యాయస్థానానికి తెలియజేయాలని సూచించింది. లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డిని ఏ 4 గా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. అయితే ఇది రాజకీయ కక్షపూరిత చర్యగా వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు. మిథున్ రెడ్డి అరెస్టు 12వది. వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అయితే జైలులో ప్రత్యేక సదుపాయాలు కోరుతూ మిథున్ రెడ్డి ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించడం విశేషం.