Fixed Deposit Tips: చాలా మంది తమ వద్ద ఉన్న మిగులు డబ్బును ఒకే బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇది సులభమైన మార్గంలా కనిపిస్తుంది. కానీ ఆర్థిక నిపుణులు చెబుతున్న ప్రకారం.. మాత్రం మొత్తం డబ్బును ఒకే బ్యాంకులో..ఒకే కాలపరిమితితో పెట్టుబడి పెట్టడం కంటే ‘ఎఫ్ డీ ల్యాడరింగ్’ విధానాన్ని పాటించడం బెటర్ అని అంటున్నారు. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అందుబాటులో ఉండటమే కాకుండా, వడ్డీ నష్టాన్ని కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. దీని వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటే?
ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీ ఎక్కువ వస్తుందని చాలా మంది భావన. అంతేకాకుండా కొందరు తమ వద్ద ఉన్న డబ్బును 5 లేదా 10 సంవత్సరాల పాటు టెన్యూర్ విధించుకుంటారు. అయితే మధ్యలో డబ్బు అవసరం పడి విత్ డ్రాయల్ చేస్తే వడ్డీ రాకపోగా.. ఫెనాల్టీ పడుతుంది. దీంతో చాలా వరకు నష్టపోతారు. అయితే ఎఫ్ డీ ల్యాడరింగ్ ద్వారా ఇటువంటి నష్టం ఉండదు.
ఉదాహరణకు ఒక వ్యక్తి వద్ద రూ.10 లక్షలు ఉన్నాయనుకుందాం.. వాటిని ఒకే బ్యాంకులో ఎఫ్ డి చేయకుండా ఐదు బ్యాంకుల్లో రూ.2 లక్షల చొప్పున విడగొట్టి పెట్టుబడి పెట్టాలి. అలాగే అన్ని ఎఫ్ డీ లకు ఒకే టెన్యూర్ కాకుండా, ఒక బ్యాంకులో ఏడాది, మరో బ్యాంకులో రెండేళ్లు, ఇంకో బ్యాంకులో మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్ల కాలపరిమితితో డిపాజిట్ చేయవచ్చు. దీనినే ఎఫ్ డీ ల్యాడరింగ్ విధానం అంటారు. ఇలా చేయడం వల్ల ప్రతి ఏడాది ఒక ఎఫ్ డీ మెచ్యూర్ అవుతూ ఉంటుంది.
ఈ విధానం వల్ల అత్యంత పెద్ద ప్రయోజనం లిక్విడిటీ. అంటే ఉదాహరణకు, రెండో ఏడాదిలో అత్యవసరంగా రూ.2 లక్షలు అవసరమైతే.. ఆ సమయంలో మెచ్యూర్ అయిన ఎఫ్ డీ ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మధ్యలోనే డబ్బు అవసరమైనా, మొత్తం రూ.10 లక్షల ఎఫ్ డీని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైన బ్యాంకులోని రూ.2 లక్షల ఎఫ్ డీ ని మాత్రమే క్లోజ్ చేసుకోవచ్చు.
వడ్డీ రేట్ల పరంగా కూడా ఈ వ్యూహం ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగితే, మెచ్యూర్ అయిన ఎఫ్ డీ మొత్తాన్ని అప్పటి అధిక వడ్డీ రేటుతో మళ్లీ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఐదేళ్లకు మొత్తం డబ్బును లాక్ చేస్తే, మధ్యలో వడ్డీ రేట్లు పెరిగినా ఆ ప్రయోజనం పొందలేరు. ల్యాడరింగ్ విధానంలో మాత్రం ప్రతి ఏడాది కొత్త రేట్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.