Andhra Pradesh Heatwave: ఏపీలో( Andhra Pradesh) ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నడి వేసవి ప్రవేశించక ముందే రోళ్లు పగిలేలా ఎండలు విరగకాస్తున్నాయి. ప్రజలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. మొన్నటి వరకు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో చిన్నపాటి వర్షాలు కొనసాగాయి. చల్లటి వాతావరణం ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలకు అసౌకర్యం తప్పడం లేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వందలాది మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేదు ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
* ఎండలకు తోడు వడగాలులు..
విపరీతమైన ఎండలకు తోడు వడగాల్పులు ఉన్నాయి. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాయలసీమలో( Rayalaseema ) ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటుతోంది. గురువారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అయితే 45.4° ఉష్ణోగ్రత నమోదయింది. కడప తో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. కర్నూలు తో పాటు నంద్యాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటలకే రహదారుల నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత కొనసాగుతూ వస్తోంది.
* రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే తీవ్రత నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు 62 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 89 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. అసలే శుభకార్యాల సీజన్ కావడంతో ప్రజలకు అసౌకర్యం తప్పడం లేదు. మరోవైపు అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. చిన్నారులతో పాటు వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గ్లూకోజ్ తో పాటు శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని కూడా చెబుతున్నారు.