Operation Duryodhana: విడుదలకు ముందు కొన్ని సినిమాలను చూసి అట్టర్ ఫ్లాప్ అవుతుందని అనుకోని, విడుదల తర్వాత సూపర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటితో ‘ఆపరేషన్ దుర్యోధన’. శ్రీకాంత్ హీరో గా , పోసాని కృష్ణ మురలో దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా , ఆ రోజుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణంగా విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమా గురించి రీసెంట్ గా పోసాని కృష్ణ మురళి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ మాటలు విన్న తర్వాత , ఇంత తక్కువ బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ సినిమాని పోసాని ఎలా తీసాడు అనే సందేహాలు రాక తప్పదు.
ఆయన మాట్లాడుతూ ‘ఆరోజుల్లో నేను తీసిన ఆపరేషన్ దుర్యోధన మూవీ కి బడ్జెట్ ఎంత అయ్యిందని అనుకుంటున్నారు?, అక్షరాలా 1 కోటి 25 లక్షలు. అంత తక్కువ బడ్జెట్ తో మొదటి కాపీ ని రెడీ చేసి నిర్మాత చేతిలో పెట్టగానే ఆయన షాక్ కి గురయ్యాడు. ఆ బడ్జెట్ లోనే నేను ఆర్టిస్టులకు మూడు పూట్ల నాన్ వెజ్ భోజనం పెట్టేవాడిని. 7 మంది కమెడియన్స్ ఈ చిత్రం కోసం పని చేశారు. వాళ్లకు ఒక్కటే చెప్పాను , ఉదయం 8 లోపు షూటింగ్ కి రావాలి , లేదంటే రాత్రి 9 గంటల వరకు షూట్ చేస్తా అని చెప్పాను. నా గోడు భరించలేక చెప్పిన టైం కంటే ముందే వచ్చేవాళ్ళు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే సమాంతరంగా శ్రీకాంత్ ‘మహాత్మ ‘ అనే చిత్రం చేస్తున్నాడు. దాని సినిమా బడ్జెట్ 10 కోట్లు. ఆ చిత్ర నిర్మాత మా బడ్జెట్ ని చూసి ఆశ్చర్యపోయాడు’.
‘మొదటి కాపీ ని చూసిన ఒక ప్రముఖుడు , ఏముంది ఇందులో, పోసాని పైత్యం మొత్తం చూపించాడు , ఇది ఆడే సమస్యే లేదు అని మా నిర్మాతతో అన్నాడట. కానీ ఆయన ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఈ సినిమాని విడుదల చేస్తాను , పోతే ఎంత పోతుంది , మహా అయితే 75 లక్షలు, మరేం పర్వాలేదు అని చెప్పి విడుదల చేసాడు. ఆ సినిమా పెద్ద సూపర్ హిట్ అయ్యి 100 రోజులు ఆడింది. ఆ రోజుల్లో 100 రోజులు ఆడితే ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో మీకు తెలుసు’ అంటూ చెప్పుకొచ్చాడు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆరోజుల్లోనే 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. కేవలం కోటి 25 లక్షలతో తీసిన సినిమా , 18 కోట్ల గ్రాస్ రాబట్టడం సాధారణమైన విషయం కాదు అనే చెప్పాలి.