AP Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆ స్థాయిలో మాత్రం ఏపీలో ప్రభావం చూపడం లేదు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండం గా మారింది. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలోనే అధికంగా ప్రభావం ఉంది. ఆ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. మోస్తరు వర్షాలతో పాటు తేలికపాటి వానలు మాత్రమే పడుతున్నాయి. దీంతో ఖరీఫ్ ఆశాజనకంగా ముందుకు సాగడం లేదు. ఎక్కడికక్కడే వర్షపాతం లోటు ఉంది.
* ఈ జిల్లాల్లో వర్షాలు..
వాయుగుండం ప్రభావంతో ఈరోజు ఏపీకి వర్ష సూచన ఉంది. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కృష్ణా, పల్నాడు, మార్కాపురం,, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలో సైతం చెదురు మదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ.
* ఉత్తర తెలంగాణలో భారీగా..
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో వర్షాలు దంచి కొట్టాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదయ్యాయి. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అంటే ఏ స్థాయిలో వర్షాలు పడ్డాయో అర్థం అవుతుంది. మరోవైపు ఏపీలో సైతం పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో 53. 4 మిల్లీమీటర్లు,, పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు 40.2, ఏలూరు జిల్లా భీమడోలు 37.6, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 37.6, ఏలూరులో 35.2, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి లో 35,, పార్వతీపురంలో 35, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 34.5, గుంటూరు జిల్లా మంగళగిరిలో 32.5, తెనాలిలో 30, తిరువూరులో 26, నరసాపురంలో 23, తాడేపల్లి గూడెంలో 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అయితే ఏపీతో పోల్చుకుంటే మాత్రం తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుండడం విశేషం.