The Paradise Teaser: నేచురల్ స్టార్ నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న నాని , ‘ది ప్యారడైజ్’ తో ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ రావడమే అందుకు కారణం. ముఖ్యంగా ‘ఆయా షేర్’ పాట అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం యూట్యూబ్ నుండే ఈ పాటకు 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఇక ఈ చిత్రం నుండి ఈ నెల 6 వ తేదీన టీజర్ విడుదల కాబోతుంది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. నాని క్యారెక్టర్ ప్రత్యేకమైన ఆసక్తి క్రియేట్ చేసింది. ఇక టీజర్ ఎలాంటి బజ్ ని ఈ సినిమాకు తెచ్చి పెడుతుందో చూడాలి. కాసేపటి క్రితమే మూవీ టీం ఒక పోస్టర్ ని విడుదల చేసి , ఈ టీజర్ కి సంబంధించిన విడుదల సమయాన్ని రేపు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చింది. అయితే ఈ పోస్టర్ లో ఎక్కడా కూడా విడుదల తేదీ ప్రస్తావన లేదు. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 21 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో , సెప్టెంబర్ 25 కి వాయిదా వేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. కానీ మేకర్స్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పోస్టర్ లో కూడా విడుదల తేదీ లేకపోవడం తో అభిమానుల్లో కాస్త అసహనం రేగింది.
కనీసం సెప్టెంబర్ లో అయినా విడుదల చేస్తారా?, లేదా డిసెంబర్ కి షిఫ్ట్ అవుతున్నారా అంటూ నాని ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. అయితే కచ్చితంగా టీజర్ లో విడుదల తేదీ ప్రస్తావన ఉంటుందని , సెప్టెంబర్ 25 న ఎట్టిపరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు అంటూ కొంతమంది అభిమానులు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఈ చిత్రం లో హీరోయిన్ గా కాయదు లోహర్ నటించగా, విలన్ గా సీనియర్ హీరో మోహన్ బాబు నటించారు. అనిరుద్ సంగీతం అందించగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రం , ఆ అంచనాలను అందుకోవడం లో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.