AP Weather Update: ఏపీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవికి మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వర్షాల జాడలేదు. ఈ తరుణంలో ఖరీఫ్ పై రైతులు ఆశలు వదులుకుంటున్నారు. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణాతో పాటు గోదావరి నదులు పరవళ్ళు తొక్కుతున్నాయి. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం ఉంటోంది. ఈ తరుణంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చెదురు మదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొస్తోంది.
* అధిక ఉష్ణోగ్రతలు..
గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా గాలివాన బీభత్సం సృష్టించింది. ప్రధానంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. సోమవారం రాత్రి 7 గంటలకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 6.4 సెంటీమీటర్లు, చోడవరంలో 6.1 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా కొత్తవలసలో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అనకాపల్లి జిల్లా వేంపాడు, పాయకరావుపేటలో 5.9, కే కోటపాడు లో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. విశాఖలో అయితే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరవాసుల వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
* ఈరోజు ఈ జిల్లాలకు హెచ్చరిక..
ఈరోజు ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. అదే సమయంలో ఈదురు గాలులు కూడా వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలుస్తోంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. పిడుగులు పడే సమయంలో, గాలులు వీచే సమయంలో.. విద్యుత్ స్తంభాలు, చెట్లు వద్ద నిల్చో వద్దని సూచిస్తోంది. సోమవారం విశాఖ నగరంలో వీచిన గాలులకు భారీ హోర్డింగులు ఎగిరిపడ్డాయి. అనకాపల్లిలో సైతం అదే పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఈదురు గాలులు వీచే సమయంలో బయటకు రాకపోవడమే ఉత్తమమని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పుకుస్తోంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. కాలువలు ఉన్నచోట్ల ఓ మోస్తారుగా పనులు జరుగుతున్నాయి.